- జాబితాలో చనిపోయినోళ్ల పేర్లు.. ఇండ్లు లేనిచోట్ల ఓట్లు..
- ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని స్థానికుల ఆందోళన
భనద్రాద్రికొత్తగూడెం, వెలుగు : త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలో అన్ని లోపాలే కనిపిస్తున్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ సహా ఇల్లెందు, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీల్లో వందలాది మంది మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయి.
కొత్తగూడెం కార్పొరేషన్‌లోనే 1,500 వరకు చనిపోయిన వారికి ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. గత పంచాయతీ ఎన్నికల్లో భద్రాచలంలో దొంగ ఓట్లు పడ్డ సందర్భాలు ఉండటంతో, ఇప్పుడు ఈ మృతుల ఓట్లను అడ్డం పెట్టుకుని రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇండ్లు కూల్చినా ఓట్లు అక్కడే..
ఇండ్లు లేని చోట కూడా ఓట్లు దర్శనమిస్తున్నాయి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లే దారిలోని తుమ్మల నగర్ ప్రాంతంలో మూడేండ్ల కిందనే రైల్వే శాఖ అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అక్కడ నివసించిన వారంతా నగరంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
కానీ, ఓటరు జాబితాలో మాత్రం ఇప్పటికీ అదే పాత అడ్రస్‌పై సుమారు 239 ఓట్లు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో నివాసాలు లేకపోయినా, జాబితాలో ఓట్లు ఉండటంతో అభ్యర్థులు ఆ ఓటర్ల కోసం ఎక్కడ వెతకాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
మారిన డివిజన్లు.. గందరగోళంలో ఓటర్లు!
ఓటరు జాబితా సవరణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ డివిజన్‌లో నివసించే వారు అదే డివిజన్‌లో ఓటు వేసేలా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక డివిజన్‌కు చెందిన ఓటర్లు వేరే డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్‌లలో నమోదయ్యారు.
21వ డివిజన్‌కు చెందిన 127 మంది ఓటర్లు 22వ డివిజన్ జాబితాలో ప్రత్యక్షమయ్యారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 200లకు పైగా, అశ్వారావుపేటలో 100, ఇల్లెందులో 21 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో ఎక్కువగా డివిజన్లలో ఓట్ల మార్పుపై అభ్యంతరాలు ఉన్నాయి.
పొంచి ఉన్న ముప్పు
ఎన్నికలకు ముందు ఇంటింటి సర్వే నిర్వహించి జాబితాను సవరించాల్సి ఉన్నా, మృతుల పేర్లను తొలగించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో ఓటు గెలుపోటములను శాసించే అవకాశం ఉన్నందున, ఈ లోపాలను సరిదిద్దకపోతే ఎన్నికల పారదర్శకత దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
