మునుగోడులో ఉప ఎన్నిక.. రసకందాయంలో రాజకీయం

మునుగోడులో ఉప ఎన్నిక.. రసకందాయంలో రాజకీయం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు వెంటనే ఆమోదం లభించడంతో..  మునుగోడు బై పోల్ అనివార్యమైంది. మరో రెండు, మూడు నెలల్లోగా ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరులోగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పోల్స్ జరగనున్నాయి. ఆ సమయంలోనే మునుగోడు ఉప ఎన్నిక కూడా నిర్వహించే చాన్స్ ఉందని అంటున్నారు. సాధారణ ఎన్నికలకు మరో 14 నెలల సమయమే ఉంది. సాధారణ ఎన్నికలు సమీపించిన ఈ కీలక సమయంలో జరగబోతున్న మునుగోడు బై పోల్ ను బీజేపీ సెమీ ఫైనల్ గా భావిస్తోంది. హుజూరాబాద్ తరహాలోనే.. మునుగోడు బై పోల్ లోనూ గెలవాలనే కృత నిశ్చయంతో కమలదళం ఉంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు పోయేందుకు సమాయత్తం అవుతోంది.

ఈక్రమంలోనే మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు 21న బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ వేదికగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కమలదళంలో చేరబోతున్నారు. రాజగోపాల్ రెడ్డి వెంట పలువురు స్థానిక కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు. ఈ బై పోల్ లో గెలవడం ద్వారా బీజేపీ బలపడిందనే సంకేతాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలోకి పంపాలనే పట్టుదలతో పార్టీ ముందుకుపోతోంది. కాగా, మునుగోడు సీటు ఖాళీ అయినట్టు తెలంగాణ అసెంబ్లీ సెక్రెటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇలా ఖాళీ అయ్యే స్థానాలకు ఆరు నెలల్లోగా బై పోల్ నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. 

టీఆర్ఎస్ ‘సంక్షేమ’ వల..  

మునుగోడు బై పోల్ ను ముందే ఊహించిన టీఆర్ఎస్ కూడా ఆ దిశగా ఇప్పటికే కుటిల సన్నాహాలు ప్రారంభించింది. ఈక్రమంలోనే ఓటర్లపైకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధుల వల విసరుతోంది. మునుగోడుపై లేని ప్రేమను .. ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించారని బీజేపీ నాయకత్వం విమర్శిస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఉంటారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని చేనేత కార్మికులకు ఉపయోగపడే ‘నేతన్న బీమా’ పథకాన్ని ఈనెల 7న కేసీఆర్ సర్కారు ప్రారంభించింది. దీంతోపాటు రాష్ట్రంలో 57 ఏళ్ల వయసున్న వారందరికీ ఆగస్టు 15 నుంచి  వృద్ధాప్య పెన్షన్లు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల నిధులను కూడా.. మునుపెన్నడూ లేని విధంగా గత రెండు, మూడు నెలల్లో టీఆర్ఎస్ సర్కారు వడివడిగా విడుదల చేసింది.