సోషల్ ​మీడియాలో వైరలవుతున్న ఆడియో  

సోషల్ ​మీడియాలో వైరలవుతున్న ఆడియో  

నల్గొండ, వెలుగు : గులాబీ కండువా కప్పుకుంటేనే గొర్లు ఇస్తామని తమతో టీఆర్ఎస్​ పార్టీ నాయకులు అంటున్నారని, ఏం చేయాలో తెలియట్లేదని మునుగోడులోని గొల్లకుర్మల మధ్య సాగిన ఫోన్​ రికార్డింగ్​ ఒకటి సోషల్ ​మీడియాలో వైరల్​గా మారింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పులిపల్పుల గ్రామానికి చెందిన ఒక గొర్ల సొసైటీ అధ్యక్షుడు, సభ్యుల మధ్య ఈ సంభాషణ జరిగింది. రెండు రోజులుగా మండలాల వారీగా పార్టీ ముఖ్యులతో జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లీడర్లు, కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. గొర్రెల స్కీంలు, కొత్త పింఛన్లు సహా గ్రామాల్లో చేపట్టే అన్ని కార్యక్రమాల్లో సర్పంచులున్నా, లేకున్నా రూలింగ్ పార్టీకి చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు, మండల పార్టీ బాధ్యులను కచ్చితంగా ఇన్వాల్వ్ ​చేయాలని సూచిస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఇటీవల మునుగోడు, చండూరు మండలాల్లో జరిగిన సమావేశాల్లోనూ గొర్రెల స్కీం గురించి చర్చించారు. గొర్ల సొసైటీ సభ్యులు లేదా అధ్యక్షులు ఎవరైనా సరే గులాబీ కండువా కప్పుకోవాల్సిందేనని, అలాంటివాళ్లకే గొర్లు ఇస్తామని, ఒకవేళ ఇతర పార్టీల్లో ఉంటే పార్టీ మారితే తెల్లారేసరికే గొర్రెలు ఇంటి ముందు ఉంటాయని టీఆర్ఎస్ ​లీడర్లు చెప్పినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని గొర్రెల సంఘ అధ్యక్షుడితో ఆ సంఘ సభ్యులు చెప్తున్న ఆడియో రికార్డింగ్​లు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. మాటల సందర్భంగా ఇన్నాళ్లూ తమను ఎవరూ పట్టించుకోలేదని, కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి రాజీనామా చేయడంతోనే ఇప్పుడు తాము గుర్తుకు వచ్చామని చెప్పడం విశేషం.