రాజగోపాల్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చిన స్పీకర్

రాజగోపాల్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చిన స్పీకర్

మునుగోడు: ఈ నెల 8న తన పదవికి రాజీనామా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని చండూరులో సొంత నిధులతో చేపట్టిన అయ్యప్ప గుడి నిర్మాణ పనులను ఆదివారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేపు స్పీకర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని ఇస్తానని తెలిపారు. ఒకవేళ స్పీకర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే... అసెంబ్లీ స్పీకర్ కు రాజీనామా లేఖను ఇస్తానని చెప్పారు. అదే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు కూడా తన రాజీనామా లేఖను పంపనున్నట్లు తెలిపారు. 

నియోజకవర్గంలో ఏ ఒక్క పనికీ కేసీఆర్ సర్కారు నిధులివ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. శేషిలేటి వాగు, వెల్మకన్నె ఫీడర్ ఛానల్ గురించి అధికారులతో చాలా సార్లు మాట్లాడానన్న ఆయన... ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మున్సిపాలిటీల అభివృద్ధికే కేసీఆర్ ప్రభుత్వం పాటుపడుతోందన్న రాజగోపాల్ రెడ్డి...  చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని ఫైర్ అయ్యారు. కాగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి స్పీకర్ రేపు (ఆగస్టు 8న) ఉదయం అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీలో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను రాజగోపాల్ రెడ్డి సమర్పించనున్నారు.