కోమటిరెడ్డి బ్రదర్స్ పద్ధతి మార్చుకోవాలి : మురళీధర్ రావు

కోమటిరెడ్డి బ్రదర్స్ పద్ధతి మార్చుకోవాలి : మురళీధర్ రావు

చండూరు, మర్రిగూడ, వెలుగు: కోమటిరెడ్డి బ్రదర్స్ పద్ధతి మార్చుకోవాలని, అహంకారం వీడి సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని  బీజేపీ జాతీయ నాయకుడు,  మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జి మురళీధర్ రావు సూచించారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం చండూరులో మీడియాతో మాట్లాడారు.  కోటిరెడ్డి బ్రదర్స్‌‌‌‌ రాజకీయ గుత్తాధిపత్యం కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. 

ఇందుకోసమే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం మానేసి నియోజవర్గంలోని డిగ్రీ కాలేజీ ఏర్పాటుతో పాటు రిజర్వాయర్లు పూర్తి చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు.  వచ్చే పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో తెలంగాణలో 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి.. గత పాలకులపై విమర్శలకు  ఎక్కువ సమయం ఇస్తున్నారని విమర్శించారు.  

ఆర్టీసీ ఆస్తులను  లీజుకు ఇస్తే సహించేది లేదన్నారు. అంతకుముందు చేనేత కార్మికుల మీటింగ్‌‌‌‌లో  పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,  జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, నేతలు దూడల బిక్షం,  దోనూరు వీరారెడ్డి, ఎరెడ్ల  శ్రీనివాస్ రెడ్డి,గుండగోని భరత్,  కోమటి వీరేశం, యాస అమరేందర్ రెడ్డి, సోమ నరసింహ పాల్గొన్నారు.