
మలక్ పేట, వెలుగు: ఓ వృద్ధుడి హత్య కేసులో మేన కోడలే నిందితురాలిగా పోలీసులు నిర్ధారించి ఆమెను అరెస్ట్ చేశారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్ వివరాలను వెల్లడించారు.
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు నగర్‌లో నివాసముంటే శివయ్య(70) కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. అదే కాలనీలో వరుసకు మేన కోడలు అయిన నెనావత్ మంగా(48) ఉంటోంది. ఆమె భర్త చనిపోవడంతో మేస్త్రీ వెంకటేశ్ తో రిలేషిన్‌షిప్‌లో ఉన్నది. శివయ్య తన ఇంటి పనులను మంగ మధ్యవర్తిత్వం ద్వారా వెంకటేశ్‌కు అప్పగించారు. రూ.10 లక్షలకు మాట్లాడుకుని రూ.8.25 లక్షలు ఇచ్చారు.
నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో తేడా రావడంతో శివయ్య తరచూ మంగతో గొడవ పెట్టుకున్నాడు. మేస్త్రీకి ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని మంగపై ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 14న మంగ ఇంట్లో రొట్టెలు చేస్తుండగా ఆ పొగ తమ ఇంట్లోకి వచ్చిందంటూ శివయ్య కుటుంబం పెద్ద గొడవ చేసింది. దీంతో కోపోద్రిక్తురాలైన మంగ అదే రాత్రి నిర్మాణంలో ఇంట్లో నిద్రిస్తున్న శివయ్యను దిండుతో మొహం అదిమిపట్టి, ప్లాస్టిక్ వైర్ గొంతుకు బిగించి హత్య చేసింది.
దొంగల పనిగా చిత్రీకరించి..
శివయ్యను హత్య చేసిన మంగ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఒక కథ అల్లింది. శివయ్య ఒంటిపై ఉన్న 30 తులాల వెండి ఆభరణాలను తీసుకుంది. ఆయనను ఆభరణాల కోసం దొంగలే హత్య చేసినట్లుగా చిత్రీకరించింది.
హత్య జరిగిన తెల్లారి తాను ఆయాగా పనిచేసే స్కూల్‌కు వెళ్లింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా గురువారం మంగ ఇంట్లో సోదాలు చేయగా చోరీకి గురైన ఆభరణాలు దొరికాయి. ఆమెను విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఆమెను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.