అమెరికాలో పాలస్తీనా బాలుడి హత్య

అమెరికాలో పాలస్తీనా బాలుడి హత్య

బాలుడి తల్లికి తీవ్ర గాయాలు

షికాగో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో అమెరికాలో జాతి విద్వేష ఘటన చోటుచేసుకుంది. షికాగోలోని ఇల్లినాయీకి చెందిన ఓ వృద్ధుడు(71) పాలస్తీనా సంతతికి చెందిన ఆరేండ్ల బాలుడిపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడి చేస్తూ పదే పదే కత్తితో పొడిచాడు. బాలుడి తల్లిని(32) కూడా తీవ్రంగా గాయపరిచాడు. శనివారం ఉదయం తమకు ఒక మహిళ నుంచి కాల్ వచ్చిందని విల్ కౌంటీ షెరీఫ్ ఆఫీసర్స్ వెల్లడించారు. 

ప్లెయిన్‌‌ఫీల్డ్ టౌన్‌‌షిప్‌‌లోని ఇన్‌‌కార్పొరేటెడ్ ఏరియాలో ఒక అద్దె ఇంటిలో తన కొడుకుతో కలిసి నివసిస్తున్నట్లు తెలిపిందని చెప్పారు. ఇంటి ఓనర్ తమపై కత్తితో దాడి చేస్తున్నాడని, తమను కాపాడాలని మహిళ కోరినట్లు వివరించారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికే మహిళ, ఆమె కొడుకు రక్తపు మడుగులో ఉన్నారని వెల్లడించారు. బాధితులను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారని.. అయితే, ట్రీట్మెంట్ పొందుతూ బాలుడు చనిపోయాడన్నారు. 

చిన్నారి డెడ్ బాడీపై డజన్ల కొద్దీ కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలిందన్నారు. బాలుడి తల్లి పరిస్థితి క్రిటికల్​గానే ఉందని చెప్పారు. నిందితుడిని జోసఫ్ క్యూబాగా గుర్తించామని.. ఘటనా స్థలంలోనే అతడిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్​లో హమాస్ దాడులకు నిరసనగా ముస్లింలైన తల్లీ కొడుకులపై జోసఫ్​ క్యూబా దాడి చేసినట్లు నిర్ధారించారు.