సర్టిఫికెట్ కోసం వచ్చిన యువతితో ఆర్ఐ అసభ్య ప్రవర్తన

సర్టిఫికెట్ కోసం వచ్చిన యువతితో ఆర్ఐ అసభ్య ప్రవర్తన

హైదరాబాద్: సర్టిఫికెట్ కోసం వచ్చిన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడో అధికారి. ఆగ్రహించిన యువతి బంధువులు సదరు అధికారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే ఓ యువతి సర్టిఫికెట్ కోసం కొన్ని రోజులుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలోనే రెవిన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ ను సర్టిఫికెట్ ఇవ్వాలని ఆ యువతి కోరింది. అయితే రేపు మాపు అంటూ ఆ అధికారి సర్టిఫికెట్ ఇష్యూ చేయకుండా తాత్సారం చేయసాగాడు. ఈ క్రమంలోనే నిన్న కార్యాలయానికి వచ్చిన ఆ యువతి రెవిన్యూ ఇన్స్పెక్టర్ ను సర్టిఫికెట్ ఇవ్వాలని బతిమిలాడింది. అయితే  సర్టిఫికెట్ కావాలంటే తనను ఒంటరిగా కలవాలని ఆ అధికారి కండిషన్ పెట్టాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో షాక్ తిన్న యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కాగా.. ఆ యువతి తల్లిదండ్రులను వెంటబెట్టుకొని ఇవాళ మళ్లీ తహసీల్దార్ ఆఫీస్ కు సర్టిఫికెట్ కోసం వచ్చింది. రెవిన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ ను సర్టిఫికెట్ ఇవ్వాలని మరోసారి బతిమిలాడింది. అయితే తన ప్రవర్తనను ఏమాత్రం మార్చుకోని ఆ అధికారి మళ్లీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అక్కడే ఉన్న యువతి తల్లిదండ్రులు రెవిన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ ను గల్లా పట్టుకొని ఎమ్మార్వో  వద్దకు లాక్కెళ్లారు. ఎమ్మార్వో ముందే ఆ అధికారిని చితకబాదారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో సదరు వ్యక్తిపై కంప్లైంట్ చేశారు.