మూసీకి పోటెత్తుతున్న వరద

మూసీకి పోటెత్తుతున్న వరద

హైదరాబాద్/ముషీరాబాద్/గండిపేట/శంకర్ పల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో చాదర్​ఘాట్​, ముసారంబాగ్​ బ్రిడ్జి వద్ద మూసీ నదికి వరద పోటెత్తుతోంది. దీంతో ఈ రెండు బ్రిడ్జిల కింద నుంచి మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏండ్లు గడుస్తున్నా ముసారాంబాగ్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గౌతమ్ రావు అన్నారు. భారీ వర్షాలు పడినప్పుడు బ్రిడ్జిపై వరద చేరితే,  రాకపోకలు బంద్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆయన విమర్శించారు.

గత కొన్నేండ్లుగా ఇదే జరుగుతోందని, శాశ్వత పరిష్కారం చూపట్లేదని మండిపడ్డారు. భారీ వర్షాలకు ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో  మంగళవారం గౌతమ్ రావు ఆ బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వానాకాలంలో ముసారాంబాగ్ బ్రిడ్జి మీదుగా వాహనదారులు భయంతో వెళ్లాల్సి వస్తోందన్నారు.  ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చేపట్టాలని కోరారు.

జంట జలాశయాలకు పెరిగిన వరద

జంట జలాశయాలైన ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్​కు మళ్లీ వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు హిమాయత్​సాగర్​కు వరద పెరగడంతో మంగళవారం అధికారులు మరో రెండు గేట్లను ఎత్తారు. హిమాయత్​సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం1,763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,761.70 అడుగులకు వరద నీరు చేరింది. ఇన్ ఫ్లో 2,500 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,750గా ఉంది. అదేవిధంగా ఉస్మాన్‌‌‌‌సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం1786.75 అడుగులుగా ఉంది.

ఇన్ ఫ్లో 1,500 క్యూసెక్కులుగా ఉంది.  హుస్సేన్​సాగర్​కు వరద తగ్గడం లేదు.   ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.45 మీటర్లకు చేరింది. మరోవైపు శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది.  పై నుంచి వస్తున్న చెత్తను 
కార్మికులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.

ALSO READ :ఎటు చూసినా నీళ్లే..మత్తడి దుంకిన చెరువులు

నిండుకుండలా లక్నాపూర్​ ప్రాజెక్టు

వికారాబాద్ జిల్లా పరిగి సెగ్మెంట్​లోని లక్నాపూర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సోమవారం రాత్రి ప్రాజెక్టు నిండి మత్తడి దూకుతోంది. దీంతో లక్నాపూర్ గ్రామానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలిన నీరు కాగ్నా నదిలో కలుస్తాయి.  

- వెలుగు, పరిగి