పురానాపూల్ బ్రిడ్జి దగ్గర మూసీ ఉగ్ర రూపం.. 13 అడుగుల ఎత్తులో దుంకుతున్న వరద.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే..!

పురానాపూల్ బ్రిడ్జి దగ్గర మూసీ ఉగ్ర రూపం.. 13 అడుగుల ఎత్తులో దుంకుతున్న వరద.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే..!

హైదరాబాద్: పురానాపూల్ బ్రిడ్జి దగ్గర మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. 13 ఫీట్ల ఎత్తులో మూసీ నది పారుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. 30 ఏళ్ళ తరువాత మళ్లీ ఇప్పుడే మూసీ నది ఈ స్థాయిలో ముంచెత్తింది. మూసీ వరద తాకిడికి గుళ్ళు మునిగిపోయాయి. చాదర్ ఘాట్, మూసా నగర్, అంబేద్కర్ బస్తీ, శంకర్ నగర్ బస్తీలు వరదలో చిక్కుకుపోయాయి.

పురానాపూల్ శివాల ఘాట్ దగ్గర ఉన్న శివాలయంలో నలుగురు వ్యక్తులు వరదలో చిక్కుకుపోయారు. శివాలయం పైనే పూజారి కుటుంబం పడిగాపులు కాస్తూ ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి. పూజారి కుటుంబానికి హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది టిఫిన్స్ అందించారు. పురానాపూల్ మూసీ పరిసర ప్రాంతాలు  ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నాయి. పురాన్‌పూల్ దగ్గర శ్మశానవాటిక నీట మునిగింది. శ్మశానవాటిక దగ్గర ఉన్న అంబులెన్స్లు, ఇతర వాహనాలు నీళ్లలో మునిగిపోయాయి.

►ALSO READ | జంట జలాశయాలకు పొటెత్తిన వరద.. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఓపెన్

హైదరాబాద్ జంట జలాశయాలకు (ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్) భారీగా వరద నీరు చేరడంతో గేట్లను ఎత్తి జలమండలి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. గండిపేట్ మొత్తం 15 గేట్ల 9 ఫీట్ల ఎత్తు వదిలి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నార్సింగ్ దగ్గర సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీరు పొంగుపొర్లుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్ గేట్ 18 దగ్గర  ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. ఈ రోడ్డు మార్గంలో వాహనాలను, చుట్టు పక్కల ప్రజలు రాకుండా పోలీసులు, హైడ్రా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.