
హైదరాబాద్ జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు వరద పొటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో రెండు జలాశయాలు పూర్తిగా నిండిపోయి నిండు కుండలా మారాయి. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. 15 గేట్లను 9 ఫీట్ల మేర ఎత్తి నీటిని కిందకు వదిలారు.
ఇన్ ఫ్లో 12600 క్యూసెక్కులు వస్తుండగా.. 13,335 క్యూసెక్కులు నీటిని దిగువన ఉన్న మూసీ, ఈసీ నదులకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి రికార్డ్ స్థాయిలో వరద పొటెత్తింది. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంత మొత్తం జలమయైంది. మూసారాం బాగ్, చాదర్ ఘాట్, పురాన్ పూల్ దగ్గర అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
మూసీ వరద ప్రభావానికి నిత్యం వేలం మంది ప్రయాణాలు సాగించే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నీట మునిగింది. బస్టాండ్ జలదిగ్భందంలో చిక్కుకుపోవడంతో రాకపోకలు నిలిపేశారు అధికారులు. బస్టాండ్‌లో చిక్కుకున్న ప్రయాణికులను తాళ్ల సహయంతో బయటకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పరివాహక ప్రాంతానికి వెళ్లొద్దని హెచ్చరించారు.