
Starlink In India: చాలా కాలంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఆయనకు చెందిన ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్ లింక్ భారత మార్కెట్లో ఎంట్రీకి చేస్తు్న్న ప్రయత్నాలకు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో త్వరలోనే భారతదేశంలో కూడా వేగవంతమైన శాటీలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
తాజాగా స్టార్ లింక్ గ్లోబల్ మెుబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటీలైట్ సేవల కోసం భారత టెలికాం రెగ్యులేటరీ సంస్థ నుంచి అనుమతులను పొందింది. సెక్యూరిటీకి సంబంధించి అన్ని నిబంధనలను పాటించటంతో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అనుమతులను పొందింది. దీంతో దేశంలో శాటీలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించటానికి అనుమతి పొందిన మూడవ సంస్థగా స్టార్ లింక్ నిలిచింది. దీనికి ముందు రిలయన్స్ జియో, వన్ వెబ్ సంస్థలు అనుమతులు పొందాయి. అయితే ప్రస్తుతం స్పేస్ ఎక్స్ భారత స్పేస్ రెగ్యులేటరీ సంస్థ In-SPACe నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే అవసరమైన డాక్యుమెంట్లను మస్క్ సంస్థ అందించిందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఎంట్రీతో భారతదేశంలో వేగవంతమైన శాటీలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అత్యంత చేరువకానున్నాయి. త్వరలోనే స్పెక్ట్రమ్ కూడా కేటాయించబడనుంది. ఈ రోజు కోసం ఎలాన్ మస్క్ సంస్థ దాదాపు 3 నుంచి 4 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. అయితే గతంలో ప్రభుత్వం సెక్యూరిటీ కారణాలను చూపుతూ ఆలస్యం చేస్తూ వచ్చింది. మెుత్తానికి సేవలను అధికారికంగా ప్రారంభించటానికి స్టార్ లింక్ గేట్ వేస్, నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్ సహా మరిన్ని అవసరాలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.