పామాయిల్ సాగులో నంబర్​వన్​ కావాలి : మంత్రి తుమ్మల

పామాయిల్ సాగులో నంబర్​వన్​ కావాలి  : మంత్రి తుమ్మల
  • అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌, హార్టీకల్చర్‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ శాఖలు సమన్వయంతో పని చేయాలి : మంత్రి తుమ్మల

హైదరాబాద్,  వెలుగు : పామాయిల్ సాగులో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రభుత్వం విధించిన టార్గెట్​ను చేరుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రతీ జిల్లాలోనూ సాగు విస్తీర్ణం పెంచి, టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేరుకునేలా ఆయిల్ ఫెడ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ ఆఫీసులో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌, హార్టీకల్చర్‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌తో మంత్రి తుమ్మల సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన రెండేండ్లలో పామాయిల్ సాగు విస్తీర్ణంపైనా మంత్రి ఆరా తీశారు. నాబార్డు సాయంతో నిధుల కొరత తీర్చేలా ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. ప్రతీ జిల్లాలోనూ ముగ్గురి చొప్పున అధికారుల్ని నియమించాలని, ఏఈవోలు సైతం పర్యవేక్షించాలన్నారు. అవసరమైన చోట టీఎస్ ఆయిల్ ఫెడ్ కు వ్యవసాయశాఖ నుంచి అధికారులు, సిబ్బందిని డిప్యూటేషన్ చేసుకోవాలన్నారు. కేంద్ర పథకాలు, సబ్సిడీలు, నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటుకు  దేశ, విదేశాల్లో  ఉన్న బెస్ట్‌‌‌‌‌‌‌‌  ప్రాక్టీసెస్‌‌‌‌‌‌‌‌ను స్టడీ చేయాలన్నారు. ఆయిల్ పామ్‌‌‌‌‌‌‌‌ విత్తన కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా హార్టీకల్చర్‌‌‌‌‌‌‌‌ పనితీరు ఉండాలన్నారు. అశ్వారావుపేట లో 400 ఎకరాల్లో ఉన్న అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ కాలేజీని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

మార్కెటింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించం

రాష్ట్ర రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండేలా అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌, హార్టీకల్చర్‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ శాఖలు కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌తో పనిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టాలనే సంకల్పంతో సర్కారు ఉందన్నారు. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్ శాఖలు పూర్తి వివరాలతో ప్రత్యేక నివేదిక, పవర్ పాయింట్‌‌‌‌‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. హార్టీకల్చర్‌‌‌‌‌‌‌‌ భూముల వివరాలు, 197 మార్కెట్ యార్డుల స్థితిగతులు వాటి పనితీరుపై పూర్తి వివరాలు అందించాలన్నారు. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ శాఖ పరిధిలోని కార్పొరేషన్ల ఆఫీసర్లతో సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పండించిన పంటలను అమ్ముకునే మార్కెట్ యార్డుల్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెటింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ప్రైవేటు కంపెనీల దందాను పూర్తిగా అరికట్టాలన్నారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.