న్యూఢిల్లీ: భారత్-జపాన్ సంవాద్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు ప్రభుత్వాలు మానవతావాదానికి పెద్ద పీట వేయాలని సూచించారు. ఇంతకుముందు కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయని, అయితే వాటిల్లో ఇతర దేశాలను వెనక్కి నెట్టడం పైనే ఫోకస్ చేశామన్నారు. కానీ ఈసారి ఇరు దేశాలు కలసి ఎదగడం మీద దృష్టి సారించాలని తెలిపారు.
‘రేపటి మన భవిష్యత్‌ను ఇవాళ్టి మన చర్యలే నిర్ణయిస్తాయి. నేర్చుకోవడంతోపాటు ఆవిష్కరణలు చేసే వారే ఈ దశాబ్దాన్ని ఏలుతారు. యువతకు మానవత్వానికి సంబంధించిన బోధనలు చేస్తూ ముందుకు నడిపించాలి. సనాతన బౌద్ధ సాహిత్యం, గ్రంథాలను భద్రపర్చడానికి ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించిన వనరులు, ఇతరత్రా ఏర్పాట్లకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉంది. బుద్ధిజానికి సంబంధించిన అనేక రచనలు, తత్వ జ్ఞానం చాలా దేశాల్లో, మఠాల్లో దొరుకుతుంది. ఇది ఓరకంగా మానవజాతిని కనుగొనడం లాంటిదే. చారిత్రాత్మకంగా చూసుకుంటే బుద్ధుడి సందేశాలు, ఆయన దివ్య జ్యోతి భారత్ నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది’ అని మోడీ పేర్కొన్నారు.
