బెదిరింపులకు తలొగ్గం.. ట్రంప్కు జిన్పింగ్ వార్నింగ్

బెదిరింపులకు తలొగ్గం.. ట్రంప్కు జిన్పింగ్ వార్నింగ్
  • ఎస్​సీవో వేదికగా పరోక్షంగా ట్రంప్​కు జిన్​పింగ్ వార్నింగ్
  • రాజకీయ ఆధిపత్యాన్ని తిప్పి కొట్టాలి
  • సభ్య దేశాలకు చైనా అధ్యక్షుడి పిలుపు
  • టెర్రరిజం ఓ సవాల్​గా మారింది: మోదీ
  • కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని ఫైర్
  • పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన సభ్య దేశాలు
  • పుతిన్, జిన్​పింగ్​తో ప్రధాని మోదీ భేటీ

తియాంజిన్ (బీజింగ్): చైనాలోని తియాంజిన్​లో జరిగిన 25వ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్​సీవో) సమిట్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాలపై అమెరికా వేస్తున్న టారిఫ్​లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ట్రంప్ వైఖరి కారణంగానే ప్రపంచంలో పరిస్థితులు అస్థిరంగా, అల్లకల్లోలంగా మారాయని మండిపడ్డారు. 

దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు ఎస్​సీవో సభ్య దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరయ్యారు. పహల్గాం టెర్రర్ అటాక్​ను అందరూ ఖండించారు. టెర్రరిజంపై పోరులో ద్వంద్వ విధానాలు పాటించడం సరికాదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఝలక్ ఇచ్చారు. 

ఇండియా, చైనాపై బార్డర్ టెర్రరిజం తీవ్ర ప్రభావం చూపుతున్నదని, ఉగ్రవాదం అనేది మానవత్వానికి, శాంతికి ముప్పుగా పరిణమించిందని అన్నారు. టెర్రరిజానికి కొన్ని దేశాలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. ఉగ్రవాదంపై రాజీపడేది లేదని మోదీ తేల్చి చెప్పారు.

ప్రపంచ దేశాలకు టెర్రరిజం పెద్ద సవాల్: మోదీ

ఇండియా 4 దశాబ్దాలుగా టెర్రరిజంతో ఇబ్బంది పడుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బార్డర్ టెర్రరిజం.. ఇండియాతో పాటు చైనాపైనా ప్రభావం చూపుతున్నది. ఇరు దేశాలకూ ఇదొక సవాల్‌‌‌‌గా మారింది. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు పరస్పర సహకారం అవసరం. దేశాలు అభివృద్ధి చెందాలంటే సరిహద్దులో శాంతి, ప్రశాంతత ఎంతో అవసరం. అప్పుడే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయి. కానీ.. చాలా దేశాలకు టెర్రరిజం, వేర్పాటువాదం పెద్ద సవాళ్లుగా మారాయి’’అని మోదీ స్పష్టం చేశారు. పాక్ ప్రధాని షెహబాజ్​పై పరోక్షంగా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. 

ఉగ్రవాదంలో ఇది అత్యంత వికృత రూపమని మండిపడ్డారు. ‘‘పహల్గాం దాడి.. దేశ గౌరవం, ప్రతిష్టపై జరిగిన దాడి. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. ఇలా చేయడం కరెక్టేనా? పహల్గాం దాడి టైమ్​లో కొన్ని దేశాలు ఇండియాకు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’ అని మోదీ పేర్కొన్నారు. జిన్​పింగ్ కలల ప్రాజెక్ట్ బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌‌‌‌ఐ) ప్రాజెక్టు గురించి మోదీ ప్రస్తావించారు. కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న బీఆర్ఐ తరహా ప్రాజెక్టులపై నమ్మకం, విశ్వాసం ఆధారంగా ముందుకువెళ్లాలని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

మోదీ కోసం 10 మినిట్స్ వెయిట్ చేసిన పుతిన్

ఎస్‌‌‌‌సీవో సమిట్ వేదిక వద్ద ప్రొసీడింగ్స్‌‌‌‌ ముగిసిన తర్వాత.. అధ్యక్షుడు పుతిన్‌‌‌‌, మోదీ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. దీనికి ముందు మోదీ కోసం కారు వద్ద 10 నిమిషాలు పుతిన్ వెయిట్ చేశారు. షాంఘై కోఆపరేషన్ సదస్సుకు పుతిన్‌‌‌‌ తన కాన్వాయ్‌‌‌‌ను తీసుకొచ్చారు. ఇందులో ‘ఆరస్‌‌‌‌ సెనేట్‌‌‌‌ లిమోసిన్‌‌‌‌’ అనే మోడల్ కారు ఎంతో ప్రత్యేకం. ఈ కారులోనే మోదీ, పుతిన్ 40 నిమిషాల పాటు ప్రయాణించి ద్వైపాక్షిక భేటీ వేదిక వద్దకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కాగా, షాంఘై సదస్సులో హాజరయ్యేందుకు వచ్చిన మోదీ కోసం చైనీస్ లగ్జరీ కార్‌‌‌‌ బ్రాండ్ ‘హాంగ్‌‌‌‌చీ ఎల్‌‌‌‌5 లిమోసిన్‌‌‌‌’ను కేటాయించారు. జిన్‌‌‌‌పింగ్ కాన్వాయ్‌‌‌‌లో ఈ కారు ఉంటుంది. దేశంలోని అగ్రనేతలు, కొందరు ఎంపిక చేసిన విదేశీ ప్రతినిధులకు మాత్రమే ఈ కారు కేటాయిస్తారు.

మోదీ, పుతిన్ భేటీకి ముందు ఇండియాపై అమెరికా ప్రశంసలు

మోదీ, పుతిన్ ద్వైపాక్షిక భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోషల్ మీడియా వేదికగా ఇండియా, అమెరికా సంబంధాలను కొనియాడారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకొంటున్నట్లు ప్రకటించారు. ‘‘ఇండియా, అమెరికా సంబంధాలు సరికొత్త శిఖరాలు అందుకుంటాయి. ఈ నెల్లోనే ఇరు దేశాల మధ్య స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఫోకస్ పెడ్తున్నాం. వీటిల్లో వాణిజ్యం, రక్షణ, ద్వైపాక్షిక అంశాలు ఉండనున్నాయి. ఇరుదేశాల ప్రజల మధ్య నెలకొన్న స్నేహమే మా సహకారానికి పునాదులుగా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది’’అని రూబియో ప్రకటించారు.

అన్ని దేశాలు భాగస్వాములు కావాలి: జిన్​పింగ్

అమెరికా వేస్తున్న టారిఫ్​లకు భయపడొద్దని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ అన్నారు. ‘‘అగ్ర దేశాల బెదిరింపులకు తలొగ్గొద్దు. ప్రపంచ వాణిజ్యవ్యవస్థ, యూఎన్​ వంటి సంస్థలను రక్షించుకోవాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎస్​సీవో దేశాలు సమాన భాగస్వాములుగా ఉండాలి. అన్ని దేశాల బలం, సంపదతో సంబంధంలేకుండా న్యాయమైన గ్లోబల్ గవర్నెన్స్ ను ప్రోత్సహించాలి. కోల్డ్ వార్ మెంటాలిటీని తిరస్కరించాలి’’ అని సభ్య దేశాలకు జిన్​పింగ్ సూచించారు. ప్రపంచంలోని కొన్ని దేశాల ‘హౌస్ రూల్స్’ను ఇతరులపై రుద్దకూడదన్నారు. ఆధిపత్యం, దురహంకార రాజకీ యాలను తిప్పికొట్టాలన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో గౌరవం ఆధారంగానే నిర్మాణాత్మక భాగస్వామ్యం ఉంటుందని, ఆధిపత్యం ప్రదర్శిస్తే చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు.

పాక్ ప్రధాని షెహబాజ్​ను పట్టించుకోని మోదీ

షాంఘై సదస్సుకు హాజరైన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ను ప్రధాని మోదీ పట్టించుకోలేదు. అసలు అతనివైపు కూడా చూడలేదు. పుతిన్, జిన్​పింగ్ కూడా షెహబాజ్​తో దూరంగానే ఉన్నారు. షేక్​హ్యాండ్ కోసం షెహబాజ్.. పుతిన్ వెనుక పరుగెత్తాల్సి వచ్చింది. కాగా, ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌‌‌, జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ షేక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ ఇచ్చి ఆలింగనం చేసుకుంటూ.. సరదాగా మాట్లా డుకుంటూ నవ్వుతున్న వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మోదీ, పుతిన్‌‌‌‌ కలిసి వెళ్తుండగా పక్కనే షెహబాజ్‌‌‌‌ నిల్చున్నప్పటికీ.. మోదీ పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియో వైరల్ అవుతోంది.

మోదీ, పుతిన్ ద్వైపాక్షిక చర్చలు

ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఇండియా, రష్యాల మధ్య సన్నిహిత సంబంధాలు కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఎస్​సీవో సమిట్ ముగిసిన తర్వాత మోదీ, పుతిన్ భేటీ అయ్యారు. అనంతరం మోదీ మాట్లాడారు. ‘‘పుతిన్‌‌‌‌తో భేటీ అద్భుతమైంది. పుతిన్ ఇండియా రాకకోసం 140 కోట్ల మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఉక్రెయిన్‌‌‌‌తో శాంతి స్థాపనకు చేపట్టే అన్ని చర్యలను స్వాగతిస్తున్నం. 

వీలైనంత త్వరగా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. స్పేస్ కోఆపరేషన్, సెక్యూరిటీ ఇష్యూస్, గ్లోబల్ సెక్యూరిటీ చాలెంజెస్‌‌‌‌పై చర్చించాం. ఇండియా, రష్యా రిలేషన్స్ స్ట్రాంగ్‌‌‌‌గా ఉన్నాయి. ట్రేడ్, ఫెర్టిలైజర్స్, స్పేస్, కల్చర్ వంటి అన్ని సెక్టార్లపై డీప్​గా చర్చించాం’’అని మోదీ తెలిపారు. అనంతరం మోదీ ఇండియాకు బయల్దేరి వచ్చేశారు.