పని మొదలుపెట్టకముందే.. పదవికి దూరమైన్రు

పని మొదలుపెట్టకముందే.. పదవికి దూరమైన్రు
  •     ఆగమైన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య
  •     సిట్టింగ్‌‌లిద్దరికీ ఎమ్మెల్యే టిక్కెట్‍ ఇవ్వని కేసీఆర్‍ 
  •     పార్టీ మారకుండా ఆర్టీసీ, రైతుబంధు చైర్మన్‌‌ పోస్టులు
  •     ఉమ్మడి జిల్లాలో ఆ రెండు చోట్లే గెలిచిన బీఆర్‌‌ఎస్‌‌
  •     ప్రభుత్వం మారడంతో పదవులు కోల్పోయిన లీడర్లు

వరంగల్‌‌/జనగామ, వెలుగు : ఎమ్మెల్యే టికెట్‌‌ దక్కకపోయినా కనీసం కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌గా అయినా కొన్నేళ్లు కొనసాగవచ్చన్న లీడర్ల ఆశలపై కాంగ్రెస్‌‌ నీళ్లు చల్లింది. బీఆర్‌‌ఎస్‌‌ అధికారంలో ఉన్న టైంలో రెండు మూడేండ్లు ఉండే కార్పొరేషన్‌‌ పోస్టులను దక్కించుకున్న లీడర్లు పూర్తిగా కుదురుకోకముందే రాజీనామాలు చేయాల్సి వచ్చింది. కొందరు ఎమ్మెల్యేలు ఓడినా మళ్లీ బీఆర్‌‌ఎస్సే అధికారంలోకి వస్తుంది, తమ పదవులకు ఢోకా ఉండదని భావించిన నేతలకు నిరాశ తప్పలేదు. కాంగ్రెస్‌‌ వేవ్‌‌ కారణంగా కేసీఆర్‌‌ మొదలు పలువురు మంత్రులు ఇంటి దారి పట్టడంతో కార్పొరేషన్‌‌ చైర్మన్లుగా ఉన్న వారంతా పదవులకు దూరం అయ్యారు. ఇందులో ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా జనగామ, స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌కు చెందిన ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య సైతం ఉన్నారు.

ఆగమైన ముత్తిరెడ్డి, తాటికొండ

అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ దాదాపు అందరు సిట్టింగ్‌‌లకు మరోసారి ఛాన్స్‌‌ ఇచ్చినా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాత్రం టికెట్‌‌ దక్కలేదు. వారి స్థానంలో జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌లో మరో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్‌‌ ఇచ్చింది. దీంతో ముత్తిరెడ్డి, తాటికొండ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి ఇతర పార్టీల నుంచి అవకాశాలు వచ్చాయి. రాజయ్యకు కాంగ్రెస్‌‌ హైకమాండ్‌‌ టికెట్‌‌ ఆఫర్‌‌ ఇచ్చింది. అయితే ఎలక్షన్లకు కొన్ని రోజుల ముందు యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్‍

తాటికొండ రాజయ్యకు రైతుబంధు సంస్థ చైర్మన్‌‌ పదవులు కట్టబెట్టారు. ఎన్నికల కోడ్‍ నేపథ్యంలో వారు ఇంకా ఆయా సంస్థలో సరిగ్గా అడుగే పెట్టలేదు. ఇంతలోనే బీఆర్‍ఎస్‌‌ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఇద్దరూ తమ చైర్మన్‌‌ పదవులకు దూరం అయ్యారు. కాగా ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా మొత్తంలో ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్య నియోజకవర్గాల్లోనే బీఆర్‌‌ఎస్‌‌ విజయం సాధించింది. దీంతో వారిద్దరూ అటు ఎమ్మెల్యేలు కాలేక, ఇటు కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ పదవుల్లో కొనసాగలేకపోయారు.

పల్లా, కడియం గెలిచినా టెన్షన్‍ తప్పట్లే..

ఎమ్మెల్సీలుగా కొనసాగుతూనే ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కించుకొని విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‍రెడ్డి, కడియం శ్రీహరి విజయం సాధించినా నిరాశతోనే ఉన్నారు. కేసీఆర్‍ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కుతుందని భావించారు. తీరా చూస్తే బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ అధికారం కోల్పోవడంతో వీరిద్దరూ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.

జనగామ, స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ నుంచి గతంలో సిట్టింగ్‌‌లుగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య ప్రస్తుతం తమ రాజకీయ భవిష్యత్‍ ఏంటో తెలియక కన్‍ఫ్యూజన్‌‌లో ఉంటే, ప్రస్తుతం ఇక్కడి నుంచి గెలిచిన పల్లా, కడియం శ్రీహరి సైతం తామిచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.