ప్రగతిభవన్​లో​ చర్చల ప్రచారం ఉత్తదే: ముత్తిరెడ్డి

ప్రగతిభవన్​లో​ చర్చల ప్రచారం ఉత్తదే: ముత్తిరెడ్డి

జనగామ, వెలుగు: ‘జనగామ టికెట్​ను ఇంకా తేల్చలే. కేసీఆర్, కేటీఆర్​పరిశీలిస్తున్నరు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటరు. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన డైరెక్షన్​లో పనిచేస్తా. ప్రగతిభవన్ లో​చర్చల పేరిట జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానమే..’ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రె లో దేవాదుల పైపులైన్​ పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

బొంతగట్టు నాగారం, బొత్తల పర్రెల మధ్య గండిరామారం రిజర్వాయర్​ నుంచి తరిగొప్పుల, దూల్మిట్ట మండలంలోని 16 చెరువులకు గ్రావిటీ కెనాల్​ ద్వారా నీరందించేందుకు ఈ కెనాల్​నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. మూడోసారి కేసీఆర్​ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గంలోని పరిస్థితులను సీఎం గమనిస్తున్నారన్నారు. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పింగిలి జగన్మోహన్​ రెడ్డి, తదితర లీడర్లు పాల్గొన్నారు.