మా నాన్న కారణజన్ముడు.. ఆయన నాకు ఒక్కడికే కాదు తెలంగాణ జాతికే హీరో: కేటీఆర్​

మా నాన్న కారణజన్ముడు.. ఆయన నాకు ఒక్కడికే కాదు తెలంగాణ జాతికే హీరో: కేటీఆర్​

చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని తెచ్చిండు
తెలంగాణ అనే పసిబిడ్డను మళ్లీ తండ్రి చేతిలో పెట్టడమే 
కేసీఆర్​కు ఇచ్చే బర్త్​ డే గిఫ్ట్ అని వ్యాఖ్య
కేసీఆర్​ కండ్లు తెరిస్తే రేవంత్​ పని ఖతం: మధుసూదనాచారి
తెలంగాణ భవన్​లో కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలు

హైదరాబాద్​, వెలుగు:  తన తండ్రి కేసీఆర్​ కారణజన్ముడని.. తనకు ఒక్కడికే కాదు తెలంగాణ జాతికి ఆయన హీరో అని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ‘‘తెలంగాణ జాతిపిత, బాపు కేసీఆర్​.. తెలంగాణ జాతికి, 4 కోట్ల ప్రజలకు హీరో. ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. సమైక్య దోపిడీ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిండు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని తెచ్చిండు” అని పేర్కొన్నారు. 

సోమవారం బీఆర్​ఎస్​ చీఫ్ కేసీఆర్​ 71వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్​లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. 71 కిలోల కేకును కట్​ చేశారు. అనంతరం కేటీఆర్, హరీశ్​రావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించే నాటికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉండేవని కేటీఆర్​ అన్నారు. ‘‘కోట్లాది మంది ప్రజల తరఫున కేసీఆర్​ ప్రత్యేక రాష్ట్రాన్ని స్వప్నించారు.  

25 ఏండ్ల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించి.. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు ఆయన” అని అన్నారు. ఇప్పుడు అందరి లక్ష్యం కేసీఆర్​ను మళ్లీ సీఎం చేయడమే కావాలని పిలుపునిచ్చారు. 60 లక్షల మంది గులాబీ సైనికులు కేసీఆర్​ను సీఎం చేసేందుకు గట్టిగా పనిచేయాలని. అదే ఆ మహానుభావుడికి మనమిచ్చే బర్త్​ డే గిఫ్ట్​ అని చెప్పారు. ‘‘తెలంగాణ అనే పసిగుడ్డును తిరిగి తండ్రి చేతిలో పెట్టడమే కేసీఆర్​కు ఇచ్చే గొప్ప బహుమతి” అని కేటీఆర్​ పేర్కొన్నారు.