మా తాతయ్యే నా దేవుడు.. ‘శ్రీనివాస మంగాపురం’ ఈవెంట్‌లో జయకృష్ణ ఎమోషనల్!

మా తాతయ్యే నా దేవుడు.. ‘శ్రీనివాస మంగాపురం’ ఈవెంట్‌లో జయకృష్ణ ఎమోషనల్!

సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయమవుతున్నారు. రమేశ్‌బాబు తనయుడు, కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'శ్రీనివాస మంగాపురం'. 'ఆర్‌ఎక్స్‌ 100', 'మంగళవారం' వంటి వైవిధ్యభరితమైన బ్లాక్‌బస్టర్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినిదత్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 గ్లింప్స్‌ రిలీజ్..

ఈ రోజు ( మే 31 ) సూపర్‌స్టార్ కృష్ణ 84వ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ యాక్షన్ గ్లింప్స్‌లో జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ లుక్స్, పవర్‌ఫుల్ ఫైట్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. 

క్రేజీ కాంబినేషన్స్..

ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతోంది. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్, కీలక పాత్రలో నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ఇప్పటికే విడుదలైన పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఊపేస్తున్నాయి.

 

వైజయంతీ మూవీస్ సెంటిమెంట్

ఘట్టమనేని కుటుంబానికి, వైజయంతీ మూవీస్‌కు దశాబ్దాల నాటి సెంటిమెంట్ ఉంది. గతంలో కృష్ణతో 'అగ్ని పర్వతం', మహేశ్‌బాబుతో 'రాజకుమారుడు' వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన అశ్వినిదత్.. ఇప్పుడు మూడో తరానికి చెందిన జయకృష్ణను పరిచయం చేస్తుండటం విశేషం.

రిలీజ్ డేట్ ఫిక్స్..

హైదరాబాద్‌లో శనివారం ( మే 30 ) జరిగిన శ్రీను-మంగ పాత్రల పరిచయ వేడుకకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తిరుమల హుండీ తరహాలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లు సాధించాలని రాఘవేంద్రరావు ఆకాంక్షించారు. మా తాతయ్య కృష్ణగారే నాకు స్పూర్తి, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని జయకృష్ణ ఎమోషనల్ కామెంట్స్ చేయగా.. జయకృష్ణలో కృష్ణగారి లాంటి ప్రయోగశీలత, పోటీతత్వం చూశానని డైరెక్టర్ అజయ్ భూపతి ధీమా వ్యక్తం చేశారు.

రెండు భిన్నమైన నేపథ్యాలతో, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ భారీ చిత్రం జూలై 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి ఈ క్రేజీ లవ్ అండ్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.