ఆస్పత్రి బెడ్ పై ఉన్నా.. కరోనా బాధలు నాకు తెలుసు

ఆస్పత్రి బెడ్ పై ఉన్నా.. కరోనా బాధలు నాకు తెలుసు

న్యూఢిల్లీ: కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. వైరస్ సోకితే ఆ బాధ ఎలా ఉంటుందనేది తనకు తెలుసన్నారు. పోస్ట్ కొవిడ్ లక్షణాలతో తానింకా బాధ పడుతున్నానని చెప్పారు. డిసెంబర్ లోగా అందరికీ టీకాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఇదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. 

'నేను ఇప్పుడు బెడ్ మీద ఉన్నా. దీర్ఘ కాలిక కొవిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నా. కరోనాతో నేను చాలా బాధపడ్డా. నాతోటి పౌరులు నాలాగా బాధపడకూడదు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రకటనలు చూస్తుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వ్యాక్సిన్ ల కొరత ఉందని తెలిసినా ఈ ఏడాది ఆఖరులోపు అందరికీ వ్యాక్సినేషన్ చేస్తామని కేంద్రం చెబుతోంది. అసలు ఇదెలా సాధ్యం? రాష్ట్రాలు, ఆస్పత్రులను వ్యాక్సిన్ కొనుక్కోమని ప్రభుత్వం చెప్పడం సరికాదు. ప్రభుత్వమే టీకాలను కొని ప్రజలకు ఉచితంగా అందివ్వాలనేది నా డిమాండ్' అని థరూర్ పేర్కొన్నారు.