
నెపిడా: అరకాన్ ఆర్మీ(ఏఏ) నియంత్రణలో ఉన్న రఖైన్ రాష్ట్రంలోని రెండు ప్రైవేట్ స్కూళ్లపై మయన్మార్ సైన్యం(జుంటా) బాంబు దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 19 మంది స్టూడెంట్లు చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు.
రఖైన్ రాష్ట్రం, క్యాక్‌టా టౌన్‌షిప్‌లోని థాయెట్ థాపిన్ గ్రామంలో ఉన్న పైన్నార్ పాన్ ఖిన్, ఎ మైన్ థిట్ అనే రెండు స్కూళ్లపై దాడి జరిగిందని అరకాన్ ఆర్మీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మయన్మార్ సైనికులు.. 500-పౌండ్ బాంబులతో ఎటాక్ చేసినట్లు వివరించింది. దాడి జరిగిన ప్రాంతం తమ నియంత్రణలోనే ఉన్నదని తెలిపింది.
తమను లక్ష్యంగా చేసుకుని సైన్యం దాడులు జరిపిందని..ఈ క్రమంలోనే బాంబులు స్కూళ్లపై పడ్డాయని వెల్లడించింది. మృతుల్లో ఎక్కువగా 15-నుంచి 21 ఏండ్ల విద్యార్థులు ఉన్నారని అరకాన్ ఆర్మీ తెలిపింది. గాయపడిన 22 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పింది.
బాంబుల తీవ్రతకు స్కూళ్ల సమీపంలోని ఆరు ఇండ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో సమాచారం ఆలస్యంగా బయటకు వచ్చింది. అరకాన్ ఆర్మీ ఈ దాడిని యుద్ధ నేరంగా ప్రకటించింది. యునిసెఫ్ కూడా అత్యంత అమానవీయ దాడిగా వర్ణించింది. అయితే, ఈ దాడిపై సైనిక జుంటా మాత్రం ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.