- గురువారం అటవీ ప్రాంతంలో మహిళ డెడ్ బాడీ గుర్తింపు
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపహాడ్ శివారులోని అటవీ ప్రాంతంలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. మహిళను ఆమె భర్తే హత్య చేసి, మిస్సింగ్ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను నిర్మల్ డీఎస్పీ టి.శ్రీనివాస్ శుక్రవారం వెల్లడించారు.
ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన మౌనిక, నల్ల అరుణ్ భార్యాభర్తలు. ఈ నెల 9న బయటకు వెళ్లిన మౌనిక తిరిగి ఇంటికి రాలేదని అరుణ్ నిర్మల్ జిల్లా మామడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తర్లపహాడ్ అటవీ ప్రాంతంలో గురువారం మౌనిక డెడ్‌బాడీ కనిపించింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే భర్త అరుణ్‌పై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మౌనికను అతడే చంపినట్లు తేలింది.
అదనపు కట్నంతో పాటు గొడవల కారణంగా మౌనిక, అరుణ్ మధ్య గొడవలు జరుగుతాయి. దీంతో మౌనికను హత్య చేయాలని నిర్ణయించుకున్న అరుణ్ ఈ నెల 9న తర్లపహాడ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేశాడు. తర్వాత తనపై అనుమానం రాకుండా... గుర్తు తెలియని వ్యక్తులు మౌనికపై అత్యాచారం, హత్య చేసి, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు సీన్ క్రియేట్ చేశాడు.
మృతురాలి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, ఇతర వస్తువులను దాచిపెట్టిన అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మౌనిక డెడ్‌బాడీ దొరికిన తర్వాత.. సీసీ పుటేజీ, సాంకేతిక ఆధారాలతో విచారణ చేసి అరుణే హత్య చేసినట్లు తేల్చారు. అరుణ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు నల్ల శ్రీనివాస్, ఆదెళ్లను అదుపులోకి తీసుకొని ఐదు తులాల బంగారు ఆభరణాలు, బైక్, సెలఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
