బాలికను చంపింది బంధువులే..వీడిన మంచిర్యాల జిల్లా నంబాల చిన్నారి హత్య కేసు మిస్టరీ

బాలికను చంపింది బంధువులే..వీడిన మంచిర్యాల జిల్లా నంబాల చిన్నారి హత్య కేసు మిస్టరీ
  •  బాలికపై లైంగిక దాడి చేసి ..హత్య చేసినట్లు పోలీసుల గుర్తింపు

దండేపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాలలో జరిగిన ఏడేండ్ల బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. బాలిక బంధువులే చిన్నారిపై లైంగిక దాడి చేసిన అనంతరం చంపేసి డెడ్‌‌బాడీని బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు వివరాలను డీసీపీ భాస్కర్‌‌ సోమవారం సాయంత్రం దండేపల్లి పోలీస్‌‌స్టేషన్‌‌లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... దండేపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన బాలిక (7) గత సోమవారం రాత్రి 7 గంటల టైంలో ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది.

 దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట ఎస్సైలు తహసీనొద్దీన్‌‌, ఎ. అనూష, జి.సురేశ్‌‌ ఆధ్వర్యంలో నాలుగు టీమ్స్‌‌ను ఏర్పాటు చేసి బాలిక ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బాలిక ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో డెడ్‌‌బాడీ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

ఘటనాస్థలానికి చేరుకున్న డాగ్‌‌స్క్వాడ్‌‌ అదే కాలనీకి చెందిన బాలిక బంధువులు శనిగారపు బాపు, ఉపారపు సతీశ్‌‌ ఇంటి వద్దకు వెళ్లాయి. నిందితుల కోసం గాలిస్తుండగా.. సోమవారం ద్వారక సమీపంలో వారిద్దరు కలుసుకొని బైక్‌‌పై మ్యాదరిపేట వైపు వస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో మాదాపూర్‌‌ గోశాల వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు. 

బాలికకు కుర్‌‌ కురే ప్యాకెట్స్‌‌, చాక్లెట్స్‌‌ ఆశ చూపి సమీప పత్తి చేనులోకి తీసుకెళ్లి.. నోట్లో గుడ్డలు కుక్కి లైంగిక దాడి చేసిన అనంతరం గొంతు నులిమి హత్య చేసి, డెడ్‌‌బాడీని బావిలో పడేసినట్లు వివరించారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌‌కు తరలించనున్నట్లు డీసీపీ వెల్లడించారు. ఫాస్ట్‌‌ ట్రాక్‌‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టేలా జిల్లా జడ్జికి లేఖ రాస్తామని చెప్పారు.