అవునా.. నిజమా : అది పెట్టె కాదు.. చెక్క దిమ్మె.. విశాఖ తీరంలో వీడిన మిస్టరీ

అవునా.. నిజమా : అది పెట్టె కాదు.. చెక్క దిమ్మె.. విశాఖ తీరంలో వీడిన మిస్టరీ

విశాఖపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ బాక్స్.. వంద కిలోల బరువు ఉంది.. అది పురాతన చెక్క పెట్టె అంటూ ప్రచారం జరిగింది. మత్స్యకారుల సమాచారంతో.. అర్థరాత్రి రంగంలోకి దిగిన మెరైన్ సిబ్బందితోపాటు.. స్థానిక పోలీసులు.. ఆ చెక్క పెట్టెకు రక్షణ కల్పించారు. ఈ విషయం తెలిసిన జనం కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనంలో ఆసక్తి పెరగటంతో.. ఈ పెట్టె సంగతి తేల్చేందుకు పోలీసులు.. రెండు జేసీబీలను రంగంలోకి దించారు. ఈ క్రమంలోను పురాతన శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు.

ఈ క్రమంలోనే పోలీస్, రెవెన్యూ, పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో.. విశాఖపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ చెక్క పెట్టెను.. జేసీబీ సాయంతో ఓపెన్ చేశారు. అయితే ఇది కేవలం చెక్క ముక్కల దిమ్మెగా తేల్చారు. నాలుగు భాగాలుగా.. పెద్ద చెక్కముక్కల దిమ్మె అది తేలిపోయింది. తీసేకొద్దీ చెక్క ముక్కలు బయటకు వచ్చాయి. సముద్రంలో తిరిగే పడవల్లో ఇలాంటి చెక్క దిమ్మెలు ఉంటాయని.. సంప్రదాయ పడవల్లోనూ ఇలాంటి చెక్క దిమ్మెలు ఉంటాయని.. సముద్రంలో మునిగిపోయిన పడవల్లో నుంచి ఈ చెక్క దిమ్మె కొట్టుకు వచ్చినట్లు అధికారులు తేల్చారు. 

భారీ పెట్టే కాదని.. చెక్క ముక్కల దిమ్మె అని నిర్థారణ కావటంతో.. ఎవరికి వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ చెక్క ముక్కలను తీరంలోనే పడేశారు.