ఓబీసీలకు మోదీనే అండ..లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట: ఎన్.రాంచందర్ రావు

ఓబీసీలకు మోదీనే అండ..లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట: ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: బీసీల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. అయితే,కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌లో 27% మంది బీసీ మంత్రులు ఉన్నారని, బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌ను తీసుకువచ్చింది కూడా మోదీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన ఓబీసీ మోర్చా సమావేశానికి రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ముఖ్య​అతిథిగా హాజరై, మాట్లాడారు. 

ప్రధాని మోదీని రాహుల్ గాంధీ కన్వర్టెడ్ బీసీ అంటూ అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. బీసీ జాబితాలు రాష్ట్రాన్ని బట్టి మారుతాయని, లంబాడాలు తెలంగాణలో ఎస్టీలు కాగా, మహారాష్ట్రలో బీసీలు అని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ కాదని, అది కేవలం గణాంకాల సేకరణ మాత్రమేనన్నారు. కుల గణనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టకపోవడం సరికాదన్నారు.

 కులగణనను అధికారికంగా చేయాలంటే, అది రాజ్యాంగబద్ధమైన సంస్థలతో, సరైన డేటా ద్వారా చేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రజల్లో బీజేపీపై పెరుగుతున్న ఆదరణను, నమ్మకాన్ని చూసి ఓబీసీలను బీజేపీ నుంచి వేరుచేయాలనే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెరతీసిందని విమర్శించారు. గతంలో ఎస్సీలకు రిజర్వేషన్ తొలగిస్తారన్న దానిపై తప్పుడు ప్రచారానికి దిగినట్లే, ఇప్పుడు ఓబీసీల విషయంలోనూ అదేవిధంగా వికృత రాజకీయం చేస్తోందని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట వేస్తామని ఆయన వెల్లడించారు.