మోడీజీ.. ఓబీసీలకు మీరేం చేశారు? : పొన్నం ప్రభాకర్

మోడీజీ.. ఓబీసీలకు మీరేం చేశారు? : పొన్నం ప్రభాకర్

గోడ మీద రాయి కాలు మీద వేసుకుని కయ్యం పెట్టుకోవడం అంటే ఇదే కావొచ్చు. బ్యాంకులను ముంచి దేశం దాటిన వారి గురించి ఏఐసీసీ, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందించారు. మోడీలను అంటే ఓబీసీలను అవమానించినట్లేనని బీజేపీ ఎంపీ సుశీల్ మోడీతోపాటు మరి కొంతమంది నాయకులు గుండెలు బాదుకుంటున్నారు. అయినా రాహుల్ గాంధీ మాట్లాడింది బ్యాంకులను ముంచిన దొంగల గురించి. వాళ్లకు సుర్కు పెట్టినట్లు మాట్లాడితే వీళ్లు చెంగున ఎగరడం ఎందుకో అర్థం కావడం లేదు. వీరికి వారికి మధ్య ఉన్న లింకేమిటి? ఓబీసీలపై టన్నుల కొద్దీ ప్రేమ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది. అయినా నీరవ్ మోడీకి,  లలిత్ మోడీకి, సుశీల్ మోడీలకు లేని బాధ వీళ్లే ఎందుకు ఎక్కువ అనుభవిస్తున్నారు. అదీ ఓబీసీల పేరు చెప్పి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంలో కమలనాథులు దిట్టలు.

గతంలో పెద్ద నోట్లు రద్దు చేసి జనాలను రోడ్ల పాలు చేశారు. కరోనా కాలంలో కనికరం లేకుండా జనాన్ని చావుల బారిన వదిలేశారు. కానీ మీడియా కెమెరాల ముందు విపరీతమైన భావోద్వేగాలతో కన్నీళ్లు తుడ్చుకొని ఇస్త్రీ చెడకుండా తుండు గుడ్డను సరి చేసుకున్న మోడీ దృశ్యాలు ఇంకా ఈ దేశ ప్రజలు మరిచిపోలేదు. ప్రతిదీ అసత్యంతో, అబద్ధంతో ముడేసి పబ్బం గడుపుకునే  వారికి ఓబీసీలు గుర్తుకు రావడం కూడా వీరి భావోద్వేగ నాటకాల పరంపరలో ఒకటి.

కేసీఆర్ ​క్లౌడ్ ​బరస్ట్ ​లాంటిదే..

కొన్ని సార్లు కొందరు పెద్దలు అనుకునే వారు చేసిన పోలికలు, సమస్య మూలాలను గుర్తించే తీరు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మొన్నీమధ్య మన రాష్ట్రంలో కుండపోత వానలు కురిశాయి. ఒక నిర్ధిష్ట ప్రాంతంలో కుండపోత వానలు కురిస్తే దాన్ని క్లౌడ్ బస్టర్ అంటారు. అయితే దీని వెనుక విదేశీయుల కుట్ర ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా క్లౌడ్ బరస్ట్ అవుతుందని నిపుణులు చెప్పారు. మరి కేసీఆర్ ఎందుకు అట్లా చెప్పారు అంటే.. వర్ష అనంతరం పునరుద్ధరణ పనులు చేపట్టడంలో జరిగిన జాప్యాన్ని, ముందస్తు ప్రణాళిక లేమి విమర్శల నుంచి తప్పించుకునేందుకు వేసిన ఎత్తు అది. తెలంగాణపై కుట్ర చేయాలని ఏదేశానికి ఉంటుంది? ఎందుకు ఉంటుంది?  రోగం ఒకటైతే మందు మరోటి అన్నట్లు... తాము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే గుడ్డి  ధైర్యంతో నాయకులు ఇట్లా కహానీలు చెప్తూ ఉంటారు. కానీ అప్పట్లో సీఎం కేసీఆర్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. అట్లాగే మోడీ అనుయాయులు కూడా  రాహుల్ గాంధీ వ్యాఖ్యల విషయంలో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొని ఓబీసీల ఆత్మగౌరవంతో ముడిపెట్టారు.

కుల గణన ఎందుకు చేయడం లేదు?

మోడీ ప్రభుత్వానికి ఓబీసీలపై నిజంగానే ప్రేమ ఉంటే తానూ ఓబీసిగా భావిస్తే ఆయా సామాజిక సమూహాల కోసం తన పదవీ కాలంలో ఏంచేశారో చెప్పాలి? వారి కోసం ప్రత్యేక బడ్జెట్ తయారు చేశారా? వారి అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారా? విద్య, వైద్య రంగాల్లో వారికి ప్రత్యేకించి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఈ దేశంలోనే అతి పెద్ద సమూహాం ఓబీసీలు. మరి వారికి మోడీ చేసిందేమిటీ? అన్నింటి కంటే కులాల వారీగా జనాభాను లెక్కించాలనే డిమాండ్ ఈ మధ్య బలంగా వినిపిస్తున్నది. వారి లెక్కలు ఎందుకు తీయడం లేదు. ఓబీసీల జీవితాలు ఎట్లా ఉన్నాయో, వారి కోసం ప్రభుత్వాలు ఏం చేయాలో కూడా  తెలుస్తుంది కదా? మరి ఆ దిశగా ఎందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదు? ఓబీసీల ఆత్మగౌరం ఎందుకు గుర్తుకు రావడం లేదు? వారి ఆత్మగౌరవం పెరగాలంటే ఏమేం చేయాలనే ఎజెండా మీ దగ్గర ఎందుకు లేదు? ఉంటే ప్రజాక్షేత్రంలో ఎందుకు పెట్టడం లేదు? మౌలికమైన ప్రశ్నల వరకు వచ్చే సరికల్లా మౌనమే సమాధానం అవుతుంది మోడీ అండ్ టీం సభ్యులకు. అన్నింటికి మించి మండల్ కమిషన్ కు వ్యతిరకంగా  కమండలం యాత్ర చేసింది వాస్తవం కాదా? కుల గణనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది నిజం కాదా?

క్షమాపణలు చెప్పండి

రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు దేశాన్ని ముంచిన దొంగల గురించి. వారికి, ఓబీసీల ఆత్మగౌరవానికి లంకె పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడమే ఓబీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లు అవుతుంది. ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ, రాజ్యసభ సభ్యులు సుశీల్ మోడీ గురించి కాదు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. అయినా ఒకరు సూరత్ కోర్టులో పిటిషన్ వేస్తే మరొకరు పాట్నా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. రాహుల్ గాంధీ వేసిన రామబాణం ముందు మాయలేళ్ల ఆటలు సాగవు. ఎన్ని తీర్లు మాట్లాడినా, ఎన్ని వేషాలేసినా నిజం అనేది నిప్పులాంటిది. బయటికి రాక తప్పదు. నెపం ఒకరిపై నెట్టడం మానేసి యదార్థంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పండి. లేదంటే అయోధ్య రాముడి ఆగ్రహానికి గురికాక తప్పదు.

బ్యాంకులను ముంచిన దొంగలు

బ్యాంకులను ముంచిన వారి జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నది. వారంతా ఏ రాష్ట్రానికి చెందిన వారో కూడా   నెటిజన్లు రాస్తూనే ఉన్నారు. అయినా పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్లు తమకేమీ తెలియనట్లు నటిస్తూనే ఉన్నారు. వాస్తవం నుంచి తప్పించుకునేందుకు ఏవేవో మాటలు చెప్తున్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించి అన్నారో.., ఎందుకు అన్నారో ప్రజలకు అర్థం అయింది. ఇక్కడ ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. బీజేపీ నాయకులకే ఉల్టా అర్థం అయింది. కడుపుల కత్తెర్లు. నోట్ల చక్కెర్లు అన్నట్లు ఓబీసీల ఆత్మగౌరవాన్ని రాహుల్ దెబ్బతీశారని అంటున్నారు. బ్యాంకులను ముంచిన దొంగలకు... ఓబీసీల ఆత్మగౌరవానికి ఎట్లా లంకె కుదురుతుంది?  కపట ప్రేమలెందుకు? సమస్యపై ప్రజల దృష్టి మరల్చేందుకు వేస్తున్న ఎత్తులు కావా? ఇవి. రాహుల్ గాంధీకి దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు, తగ్గుతున్న మోడీ ప్రభ నుంచి తమను తాము తప్పించుకునే ఎత్తుగడ కాదా? ఇవన్నీ కఠోర వాస్తవాలు.

- పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ, కరీంనగర్