‘ఇందిర సౌర గిరి’ స్కీమ్కు నాబార్డ్ సాయం

‘ఇందిర సౌర గిరి’ స్కీమ్కు నాబార్డ్ సాయం
  • ప్రభుత్వ గ్యారంటీతో లోన్
  • అధికారుల చర్చలు.. నాబార్డు అంగీకారం 

హైదరాబాద్, వెలుగు:  గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ‘‘ఇందిర సౌర గిరి జల వికాసం’’ స్కీమ్ అమలుకు నాబార్డ్ నుంచి ప్రభుత్వం లోన్ తీసుకోనుంది. ఈ అంశంపై ట్రైబల్ శాఖ అధికారులు ఇప్పటికే నాబార్డ్ సీజీఎంతో పాటు తెలంగాణ రీజియన్ అధికారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ గ్యారంటీతో తొలి దశలో రూ. 600 కోట్ల లోన్ మంజూరుకు నాబార్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే మార్చిలో లోన్ మంజూరు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోన్ మంజూరు కాగానే అన్ని జిల్లాల్లో అర్హులైన గిరిజన రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ స్కీమ్ అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్​లో ప్రభుత్వం రూ. 600 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 10 వేల మంది రైతులకు స్కీమ్ ను అమలు చేయనున్నారు.

కాగా, ఆర్వోఎఫ్ఆర్(-అటవీ హక్కుల పత్రాలు) కలిగిన 2.1 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ స్కీమ్ లక్ష్యం. ప్రతి రైతుకు సుమారు రూ. 6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్ , సోలార్ ప్యానెళ్లు, పరికరాలను100 శాతం సబ్సిడీతో ఉచితంగా అందజేస్తారు. ఈ స్కీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి గతేడాది మే19న నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించారు. మొత్తం 21 మంది రైతులకు పంపు సెట్లు, సోలార్ ప్యానెళ్లు అందజేశారు. సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విక్రయించడం ద్వారా రైతులకు నెలకు రూ. 3,000 నుండి రూ. 5,000 వరకు అదనపు ఆదాయం లభించేలా ప్రణాళిక రూపొందించారు.