
గజ్వేల్(వర్గల్), వెలుగు: గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన నాచగిరి లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శనివారం నాచగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి కొత్తగా ఏర్పాటైన ధర్మకర్తల మండలి సన్మాన, అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరిట నాచగిరి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు పలుమార్లు ప్రకటించినా వారి నిర్లక్ష్యం కారణంగా అది కార్యరూపం దాల్చలేదన్నారు.
తమ ప్రభుత్వం నాచగిరిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోందన్నారు. విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి యాదాద్రి తరహాలో నాచగిరి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం చైర్మన్ రవీందర్ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వం, దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి చేస్తానన్నారు. ఆలయ ఈవో విజయరామారావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు భూమ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, ధర్మకర్తలు కర్రె పద్మ వెంకటేశ్, దేశపతి ఉషశ్రీ, జగ్గయ్యగారి శేఖర్ గుప్తా, గాలి కిష్టయ్య, సురేందర్ రెడ్డి, తిరుమల రావు, రుద్ర శ్రీహరి, కొత్తపల్లి శ్రీనివాస్, చందా నాగరాజు గుప్తా, ఎక్స్ అఫీషియో సభ్యులు జగన్నాథ ఆచార్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్తా, నాచగిరి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు నర్సింలు పాల్గొన్నారు.