ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి నిల్వలు.. నిలిచిన ఆర్డీఎస్ పంపులు, ఎండుతున్న పంటలు

ప్రాజెక్టుల్లో  తగ్గిన నీటి నిల్వలు.. నిలిచిన ఆర్డీఎస్  పంపులు, ఎండుతున్న పంటలు
  • నిలిచిన ఆర్డీఎస్  పంపులు, ఎండుతున్న పంటలు
  • 5వ ఇండెంట్  నీళ్లు వచ్చినా తిప్పలే
  • మరో వారం రోజులే ఆయకట్టుకు సాగునీరు
  • నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఎండుతున్న పంటలు
  • నడిగడ్డలో తప్పని సాగునీటి కష్టాలు

గద్వాల, వెలుగు:ప్రాజెక్టులలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతుండడంతో కృష్ణ, తుంగభద్ర నదుల మధ్యలో ఉన్న నడిగడ్డకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. తుంగభద్ర నదిలో నీటి లెవెల్  తగ్గిపోవడంతో ఆర్డీఎస్  పంపింగ్  నిలిచిపోయింది. జూరాల ప్రాజెక్టులో కూడా ప్రస్తుతం తాగునీటి అవసరాలకు పోను 1.20 టీఎంసీలు మాత్రమే సాగునీటికి వాడుకునే అవకాశం ఉంది. యాసంగిలో వారబందీ కింద రెండు రోజులు మాత్రమే జూరాల ఆయకట్టుకు నీరు ఇస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కూడా ఆశించిన స్థాయిలో నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. 

ఇప్పటికే ఆయకట్టు రైతులు ఆందోళనలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల రిపేర్లు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉంది. దీంతో ప్రతిఏటా యాసంగిలో పంటలు కాపాడుకునేందుకు పక్క రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తోంది.

మూడు ప్రాజెక్టుల పరిధిలో 73 వేల ఎకరాలకే..

యాసంగిలో నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్, జూరాల ప్రాజెక్టు, ఆర్డీఎస్  కింద 2.66 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఈ ఏడాది యాసంగి కింద కేవలం 73 వేల ఎకరాలకు వారబందీ పద్దతిలో సాగునీరు అందించాలని ఇరిగేషన్  ఆఫీసర్లు నిర్ణయించారు. తుంగభద్ర నదిలో నీటి లెవెల్  తగ్గిపోవడంతో ఆర్డీఎస్  పంపులు ఆగిపోయాయి. మొదట వారంలో మూడు రోజులు నీళ్లిస్తామని చెప్పిన అధికారులు, కృష్ణా నదికి కూడా నీళ్లు సరిగా రాకపోవడంతో నెల రోజుల నుంచి వారంలో రెండు రోజులు మాత్రమే నీళ్లిస్తున్నారు.

తగ్గిన నీటి నిల్వలు..

జూరాల ప్రాజెక్టులో 2.42 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. తాగునీటి అవసరాలకు పోను 1.30 టీఎంసీలు మాత్రమే సాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సి ఉంటుంది. గతంలో ఏప్రిల్ 15 వరకు నీళ్లిస్తామని చెప్పినప్పటికీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని మంత్రుల బృందం కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంను కోరారు. అయితే కర్నాటక నుంచి ఒక టీఎంసీ మాత్రమే విడుదల చేశారు. ఇంకా నాలుగు టీఎంసీ నీళ్లు వస్తాయా? లేదా? అనే విషయంపై  అనుమానం వ్యక్తమవుతోంది. అవి వస్తే ఎండాకాలంలో గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది.

ఎండుతున్న పంటలు..

నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్  స్కీం కింద యాసంగిలో 20వేల ఎకరాలకు సాగునీటిని ఇస్తామని ఆఫీసర్లు చెప్పారు. లెఫ్ట్  కెనాల్  కింద 105వ ప్యాకేజీ రైట్  కెనాల్  డిస్ట్రిబ్యూటర్  5 వరకు 15 వేల ఎకరాలకు, లెఫ్ట్ కెనాల్  కింద 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఆఫీసర్లు ప్రతిపాదించారు. కానీ, 104వ ప్యాకేజీ కింద రైతులకు నీళ్లు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంతమేర పంట పొలాలు ఎండిపోయాయి.

5వ ఇండెంట్  వచ్చినా?

తుంగభద్ర నదిలో తెలంగాణ వాటా కింద 5వ విడత(ఇండెంట్) నీళ్లు వచ్చినా ప్రస్తుతం ఆర్డీఎస్  ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్డీఎస్  కింద మొదటి విడతలో 1.078, రెండో విడతలో 1.04, మూడో విడతలో 1.555, నాలుగో విడతలో 1,116 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఐదవ విడత కింద 1.057 టీఎంసీలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఐదో విడత కింద ఈ నెల 5న ఇండెంట్  పెట్టగా, ఈ నెల13 నుంచి నీళ్లు వస్తున్నాయి. మరో వారం రోజులు మాత్రమే ఆర్డీఎస్  ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు అవకాశం ఉందని ఆఫీసర్లు
 చెబుతున్నారు.

వారం రోజులే నీళ్లిస్తాం..

ఆర్డీఎస్  కింద ఆయకట్టుకు మరో వారం మాత్రమే నీళ్లిస్తాం. ఐదో విడత ఇండెంట్ వాటా నీళ్లు ఈ నెల 13 నుంచి వస్తున్నాయి. 7 రోజుల కంటే ఎక్కువగా నీళ్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.– విజయ భాస్కర్ రెడ్డి, ఈఈ ఆర్డీఎస్