ఏ పాటి వాడికైనా ఆ పాటి అసూయ పరిపాటే

ఏ పాటి వాడికైనా ఆ పాటి అసూయ పరిపాటే

మెగా బ్రదర్ నాగబాబు అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్పై ఎవరు నెగిటివ్ కామెంట్లు చేస్తే ఇచ్చి పడేస్తుంటాడు. తన అన్న, తమ్ముడిపై వచ్చే విమర్శలకు ధీటుగా బదులిస్తుంటాడు. తాజాగా నాగబాబు మరోసారి తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఎవరి పేరు ఎత్తకుండానే తన అన్నను చూస్తే ఎవరికైనా అసూయ కలుగుతుందని చురకలంటించారు. "ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే.." అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. నాగబాబు ట్వీట్లో ఎవరి పేరు ప్రస్తావించకపోయినా.. గరికపాటిని ఉద్దేశించే ఆయన ఈ కామెంట్లు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడేందుకు గరికపాటి మైక్ తీసుకోగా.. అదే సమయంలో స్టేజ్ పై ఉన్న మహిళలు, యువతులు చిరంజీవితో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అది చూసి అసహనానికి గురైన గరికపాటి ఫొటో సెషన్‌ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతా నాకు సెలవిప్పించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిర్వాహకులు గరికపాటికి సర్దిచెప్పడం, చిరంజీవి వేదికపైకి వచ్చేయడంతో ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే చిరు విషయంలో గరికపాటి అసహనానికి గురవడంతో హర్ట్ అయిన నాగబాబు ఆయనను ఉద్దేశించి ట్విట్టర్లో ట్వీట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.