ప్రాజెక్టుల అవినీతిపై నాగం పిటిషన్.. సుప్రీం విచారణ

ప్రాజెక్టుల అవినీతిపై నాగం పిటిషన్..  సుప్రీం విచారణ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో అవినీతి జరిగిందంటూ మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం పిటిషన్  విచారణను సుప్రీంకోర్టు స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించిన ముకుల్ రోహత్గి, దుష్కంత్ దవే లు పిటిషన్ ను డిస్మిస్ చేయాలని కోరారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతోనే పిటిషన్ వేశారని వాదించారు. 2016లోనే నాగం వేసిన పిటిషన్ ను కొట్టేశారని గుర్తు చేశారు. గతంలో నాలుగు పిటిషన్లను కొట్టేశారంటూ వాదించారు. ఇటువంటి పిటిషన్లతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతుందని కోర్టుకు తెలిపారు. నాగం తరఫున వాదించిన ప్రశాంత్ బూషణ్ గతంలో పిటషన్లకు.. ఈ పిటిషన్ కు తేడా ఉందని చెప్పుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈనెల 30కు వాయిదా వేసింది.

 పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రూ. 2400 కోట్ల అవినీతి జరిగిందని నాగం ఆరోపించారు. పంప్‌హౌజ్‌లో బిగించిన మోటార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరను వేశారని  నాగం ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 72 గంటల్లో టెండర్లలోను ఫైనల్ చేశారని.. ఇతర కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగానే టెండర్లను ఫైనల్ చేశారని నాగం ఆరోపించారు.