సంగమేశ్వరం పుట్టిందే ప్రగతి భవన్‌ల

V6 Velugu Posted on Jul 06, 2021

టెండర్‌ను మేఘా కృష్ణారెడ్డికి ఇవ్వాలని చెప్పింది కేసీఆరే: నాగం
రాయలసీమకు నీళ్లిస్తాననడానికి సీఎంకు బుద్ధుండాలని ఫైర్‌
అలాట్‌మెంట్‌ ఉన్న 299 టీఎంసీలే వాడుకోలేకపోతున్నం: రిటైర్డ్‌ ఇంజనీర్‌ రంగారెడ్డి
299 టీఎంసీలకు ఒప్పుకొని ప్రజలకు కేసీఆర్‌ ద్రోహం చేశారు: ప్రకాశ్‌రెడ్డి
ఏపీ నీళ్ల దోపిడీపై తెలంగాణ ఒక్క ఫిర్యాదు కూడా చేయలే: సంపత్‌ 
పాలమూరు రంగారెడ్డి కొత్త ప్రాజెక్టు కాదు: రావుల 

హైదరాబాద్‌, వెలుగు: సంగమేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కట్టాలనే ఐడియా పుట్టిందే ప్రగతి భవన్‌లోనని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. సంగమేశ్వరం ఎత్తిపోతల టెండర్‌ను మేఘా కృష్ణారెడ్డికి ఇవ్వాలని చెప్పింది కేసీఆరే అని అన్నారు. ఇందులో జగన్‌, కేసీఆర్‌ వాటాలెంతో ఎవరికీ తెలియదన్నారు. రివర్‌ లిఫ్టింగ్‌ పేరుతో ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని, కృష్ణా నీళ్లు ఆంధ్రోళ్లు దోచుకెళ్లాలన్నదే సీఎం ఎత్తుగడని చెప్పారు. ఏపీని నీళ్లు దోచుకుపొమ్మని కేసీఆరే చెప్పినప్పుడు వాళ్లను తిట్టడం ఎందుకన్నారు. కేసీఆర్‌ మూర్ఖుడని, ఎన్ని లేఖలు రాసినా, విజ్ఞప్తులు పంపినా పట్టించుకోరని విమర్శించారు. కాళేశ్వరం కింద ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు. బక్కటోడైన ఈటలను సతాయించే టైమ్‌ను.. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌ పెడితే అవి పూర్తయ్యేవన్నారు. 

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘నీళ్లు నిజాలు’ అంశంపై సోమవారం నిర్వహించిన ఆల్‌‌ పార్టీ మీటింగ్‌‌లో జనార్దన్‌‌రెడ్డి మాట్లాడారు. ఏపీ అనుమతించనప్పుడైనా సిగ్గు పడాల్సింది కేఆర్‌‌ఎంబీ టీమ్‌‌ను పోతిరెడ్డిపాడుకు ఏపీ సర్కారు అనుమతించనప్పుడైనా సీఎం సిగ్గు పడాల్సిందని నాగం విమర్శించారు. కృష్ణా నీళ్లను మళ్లించుకోవడంలో కేసీఆర్‌‌ సర్కారు ఫెయిల్‌‌ అయిందన్నారు. కేటాయింపులకు మించి నీళ్లను ఏపీ తీసుకుంటున్నా మన ప్రభుత్వానికి సోయి లేదన్నారు. రాయలసీమకు నీళ్లిస్తాననడానికి కేసీఆర్‌‌కు బుద్ధుందా అని మండిపడ్డారు. 69 శాతం కృష్ణా పరీవాహక ప్రాంతమున్న తెలంగాణకు 500 టీఎంసీలకు పైగా నీళ్లు దక్కాల్సి ఉందన్నారు. రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తే పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చేవన్నారు. గోదావరి నీళ్లు తెస్తామని భారీ ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారని కేసీఆర్‌‌ను విమర్శించారు.
మంత్రులు అప్పుడు సన్నాసుల్లెక్క ఉండి..
‘తెలంగాణ మంత్రులు అజ్ఞానులు, వాళ్లకేం తెలియదు. ఏపీ ప్రాజెక్టులు కట్టుకోవాలని సీఎం అన్నప్పుడు ఒక్క మంత్రి అయినా వ్యతిరేకించారా? అప్పుడు సన్నాసుల్లెక్క ఉండి ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నరు’ అని నాగం మండిపడ్డారు. ‘ఆంధ్రులు రాక్షసులు’ అని మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. శ్రీశైలం హైడల్‌‌ పవర్‌‌ ప్రాజెక్టని ఏ ఒక్కరికైనా తెలుసా అని అడిగారు. జూరాల స్టేజ్‌‌ 2 గురించి ఎవరికీ అవగాహన లేదన్నారు. శ్రీశైలం నీళ్లతో సోమశిల నింపుకుంటాం, నెల్లూరులో రెండు పంటలు పండించుకుంటామని ఏపీ మంత్రి అనిల్‌‌ మాట్లాడుతున్నారని.. ఇలాంటి వాటికి సమాధానం చెప్పే బాధ్యత మంత్రులకు లేదా అని ప్రశ్నించారు.
రెండు సార్లు వాయిదా వేయించారు: ప్రకాశ్‌‌ రెడ్డి
నీటి గొడవలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని బీజేపీ నేత ప్రకాశ్‌‌ రెడ్డి చెప్పారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకొని కేసీఆర్ మొదటి ద్రోహం చేశారని, ఆయన డిమాండ్ మేరకే ఈ నిర్ణయం జరిగిందన్నారు. బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారని, కేంద్ర మంత్రి ఆహ్వానిస్తే రెండు సార్లు వాయిదా వేసి సంగమేశ్వర టెండర్లు పూర్తయ్యేవరకు కేసీఆర్ టైమివ్వలేదని ఆరోపించారు. సుప్రీంలో వేసిన కేసును విత్ డ్రా చేసుకుంటానని అపెక్స్ కౌన్సిల్‌‌లో కేసీఆర్‌‌ ఒప్పుకున్నారని, దీనికి 8 నెలలు ఎందుకు పట్టిందో, ఆ 8 నెలలు ఎక్కడ పడుకున్నారో కేసీఆర్ చెప్పాలని 
డిమాండ్ చేశారు.
హక్కులు కాపాడుతలేరు: రావుల 
పాలమూరు కొత్త ప్రాజెక్టు కాదని, ఉమ్మడి పాలకుల సమయంలో ప్రారంభించిందేనని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కృష్ణా నీళ్లను సాధ్యమైనంత వాడుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2 రాష్ట్రాలకు పెద్ద ప్రమాదం కర్ణాటక నుంచేనన్నారు. 
ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌‌పై చర్చ జరగాలి: పశ్య పద్మ
సమస్య పరిష్కారానికి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సరైన ప్లాన్లు కేంద్రం ముందు ఉంచాలని సీపీఎం నేత పశ్య పద్మ సూచించారు. కేంద్రంపై పోరాడతానన్న కేసీఆర్.. అందుకు కార్యాచరణ ఎందుకు ప్రకటించడం లేదన్నారు. 
కేసీఆర్‌‌.. చెప్పేది వినరు: సారంపల్లి
సెంటిమెంట్‌‌ రాజకీయాల కోసమే జలజగడానికి కేసీఆర్‌‌ ఫుల్‌‌ స్టాప్‌‌ పెట్టట్లేదని సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 10 టీఎంసీలు తరలిస్తే 23 రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుందన్నారు. కేసీఆర్‌‌కు తోచింది చేస్తారే తప్ప ఎవరు చెప్పినా వినిపించుకోరన్నారు.

హుజూరాబాద్‌‌ ఉప ఎన్నిక కోసమే: శ్రీశైలం రెడ్డి 
హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికలో లబ్ధి కోసమే కృష్ణా నీళ్ల పంచాయితీని కేసీఆర్‌‌ ముందుకు తెచ్చారని టీజేఎస్‌‌ నేత శ్రీశైలం రెడ్డి అన్నారు. 
కేసీఆర్‌‌వి నాటకాలు: సంపత్ కుమార్
సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశారని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఆరోపించారు. ఉప ఎన్నికలో గెలిచేందుకే జలజగడం తెరపైకి తెచ్చారన్నారు. ఆర్థిక, రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం నిర్మిస్తున్నారని చెప్పారు. జగన్ అధికారంలోకి రాగానే అనుమతులు లేకున్నా 88 వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకెళ్తానని చెప్పారని గుర్తు చేశారు. మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తెలిసినా తెలియనట్లు కేసీఆర్‌‌ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. ఆర్డీఎస్‌‌ను ఎందుకు పట్టించుకోలేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జోగులాంబ బ్యారేజీ వయబుల్‌ కాదు: రిటైర్డ్‌ ఇంజనీర్‌ రంగారెడ్డి
ప్రభుత్వం నిర్మిస్తామంటున్న జోగులాంబ బ్యారేజీ వయబుల్‌ కాదని రిటైర్డ్‌ ఇంజనీర్లు ఎన్‌. రంగారెడ్డి అన్నారు. నీళ్లపై మన సర్కారుకు అవగాహన లేకనే నష్టపోతున్నామ న్నారు. తెలంగాణకు అడహక్‌ అలాట్‌మెంట్‌ ఉన్న 299 టీఎంసీలనే వాడుకోలేకపోతు న్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం టార్గెట్‌ పెట్టుకుని పనులు చేస్తుంటే మన ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు. వరద నీటి పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా 400 టీఎంసీల ప్రాజెక్టులు ఏపీ కట్టుకుందని తెలిపారు. ఇప్పటికైనా టీఎంసీల లెక్కలు పెట్టి వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకోవాలని సూచించారు. పోతిరెడ్డిపాడు విస్తరణ సహా ఏపీ ప్రాజెక్టులను మనం ఆపలేమని, జూరాల నుంచే రోజుకు నాలుగైదు టీఎంసీలను మళ్లించుకు నేలా ప్రాజెక్టులు నిర్మించుకోవాల న్నారు. పాలమూరు రంగారెడ్డి స్టేజ్‌ను జూరాల నుంచి చేపట్టి 80 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల కోసం 500 టీఎంసీల నీళ్లు అవసరమున్నాయని చెప్పారు

Tagged sangameshwaram, project, nagam janardhan reddy, Lift Irrigation,

Latest Videos

Subscribe Now

More News