ఆనాడు కేసీఆర్ తల నరుక్కుంటానన్నాడు : నాగం

ఆనాడు కేసీఆర్ తల నరుక్కుంటానన్నాడు : నాగం

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని భూనిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇచ్చిన తరువాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభం చేస్తామన్న కేసీఆర్… ఇప్పుడు ఆ మాటని గాలికొదిలేశారని  మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఈ రోజు (మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ..  పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన భూనిర్వాతులపై ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడం దారుణమన్నారు. ఆనాడు ముంపు బాధితులకు న్యాయం చేయకుంటే తల నరుక్కుంటానన్న కేసీఆర్..  పరిహారం అడిగేందుకు వస్తున్న బాధితులను అడ్డుకొని వారిపై దాడి చేయించడాన్ని తాము ఖండిస్తున్నట్టు నాగం  అన్నారు.

ఒకప్పుడు ఆంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమంలో ధర్నా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ..  సాధించి తెచ్చుకున్న తెలంగాణలో..  ఇప్పుడు కేసీఆర్ ధర్నా చేయనివ్వడం లేదని, న్యాయం కోసం మాట్లాడనివ్వడం లేదని అన్నారు.  భూ నిర్వాసితులు చేస్తున్న పోరాటం న్యాయమైనదేనని ఒకప్పడు కేసీఆరే స్వయంగా అన్నారని నాగం అన్నారు. కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దరిద్రమని ఆయన అన్నారు.

ప్రాజెక్టు పనుల్లో భాగంగా 15 టిప్పర్ల మట్టిని తీసినందుకు కాంట్రాక్టర్లకు  4లక్షల 50 వేలు ఇస్తున్న కేసీఆర్..  రైతులకు మాత్రం ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదన్నారు. తమ భూములను కోల్పోతున్న రైతులకు కనీసం ఎకరాకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని నాగం డిమాండ్ చేశారు.