
-
నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు చేరుకున్న ట్రైన్స్వా
-
గతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వెంకటరెడ్డి
హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: నాగ్‌పూర్ నుంచి బయల్దేరిన వందే భారత్ ట్రైన్ సోమవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్రైన్‌కు జెండా ఊపి ఘన స్వాగతం పలికారు. కాగా, తెలంగాణకు ఇది ఐదో వందే భారత్ ట్రైన్. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ తర్వాత తెలంగాణకే కేంద్రం ఎక్కువ వందే భారత్ రైళ్లు కేటాయించిందన్నారు. ‘‘రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాని మోదీ వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి రెండు, తిరుపతి, బెంగళూరుకు ఒక్కో వందే భారత్ ట్రైన్ సేవలు అందుతున్నాయి. నాగ్‌పూర్–సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ట్రైన్ సేవలు అందుబాటులోకి రావడంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఎడ్యుకేషన్, టూరిజం, బిజెనెస్ సంబంధాలు బలపడ్తాయి. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఈ ట్రైన్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్న’’అని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన ఎంతో మంది జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారికి ఈ ట్రైన్ ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
దేశవ్యాప్తంగా కవచ్ వ్యవస్థ
రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ విమానాశ్రయం మాదిరి ఆధునికరిస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే రంగంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నదని తెలిపారు. ఇప్పటి వరకు కూత వినబడని ప్రాంతాల్లోనూ రైల్వే సేవలు అందుతున్నాయన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. కవచ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.429 కోట్లు కేటాయించామని తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరించేందుకు రూ.425 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.