తెలుగు బిగ్బాస్: నేహ ఎలిమినేట్ అయ్యింది

తెలుగు బిగ్బాస్: నేహ ఎలిమినేట్ అయ్యింది

మూడో వీకెండ్‌లో రెండో ఎసిపోడ్‌ని సరదా సరదాగానే ప్లాన్ చేశారు. అయితే ఎంత ఎంటర్‌‌టైన్‌మెంట్ ఉన్నప్పటికీ ఆదివారం అనగానే అందరి మనసుల్లోనూ ఎలిమినేషన్ భయం పేరుకుపోయి ఉంటుంది. తామెక్కడ బిగ్‌బాస్ ఇంటి నుంచి తమ ఇంటికి వెళ్లిపోతామో అనే టెన్షన్ నామినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్నీ వెంటాడుతుంది. మరి ఎవరి భయం నిజమయ్యింది? ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్ మెయిన్ గేట్ ఎవరి కోసం తెరుచుకుంది?

టెరిఫిక్ ట్యాగ్స్

ఈ ఎపిసోడ్‌లో ముందుగా కంటెస్టెంట్లతో ఓ గేమ్ ఆడించారు నాగ్. ఓ సుత్తిని తెచ్చి అక్కడ పెట్టారు. ఒక్కొక్కరినీ లేపి ఒక్కో ప్రశ్న అడిగారు. దానికి ఆన్సర్‌‌గా ఎవరి పేరు అనుకుంటున్నారో చెప్పాలి. ఆ జవాబుతో ఆడియెన్స్ ఏకీభవిస్తే దెబ్బ సదరు వ్యక్తికి. లేదంటే ఆ సుత్తిదెబ్బ తిరిగి పేరు చెప్పినవారికే. ముందుగా హౌస్‌లో నోటిదూల ఎవరికి ఎక్కువని ఆదిరెడ్డిని అడిగారు నాగ్. అతను గీతూ పేరు చెప్పాడు. ఇద్దరు తప్ప మిగతా ఆడియెన్స్ అంతా ఎస్ అన్నారు. ఆ తర్వాత బ్రెయిన్‌లెస్ ఎవరని మెరీనా, రోహిత్‌లని అడిగితే రాజ్ అన్నారు. కానీ అది ప్రేక్షకులు ఒప్పుకోలేదు. తర్వాత నేహా డ్రమటిక్ అని, గీతూ అనాయింగ్, బోరింగ్ అని, బాలాదిత్య అటెన్షన్ సీకర్ అని, కీర్తి గుడ్డి ఎద్దు అని, ఆరోహి డామినేటింగ్, ఫేక్ అని, శ్రీసత్య హార్ట్లెస్ అని, ఇనయా యూజ్‌లెస్, బిటర్ అని, మెరీనా–రోహిత్‌ ఎయిమ్‌లెస్ అని.. ఇలా ఎవరి మనసుకి అనిపించినట్టు వారికి ట్యాగ్స్ ఇచ్చుకుంటూ పోయారు. కొన్నింటిని ఆడియెన్స్ ఒప్పుకున్నారు, కొన్నయితే కరెక్ట్ కాదన్నారు. ఈ క్రమంలో రేవంత్‌కి పనిదొంగ, లూజర్, ఫైటర్ కాక్, తిండిబోతు అనే ట్యాగ్స్ వచ్చాయి. కానీ ఆడియెన్స్ దేనినీ యాక్సెప్ట్ చేయలేదు. అవన్నీ తప్పేనన్నారు. దాంతో వచ్చినవాళ్లంతా రేవంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ అయి ఉంటారంటూ మిగతా సభ్యులంతా సెటైర్లు వేసి నవ్వారు. 

ఇంట్లో ఎవరు గాడిద?

ఆ తర్వాత మరో గేమ్ కూడా ఆడించారు నాగ్. ఇది కూడా వారి ఆట తీరుకు, ప్రవర్తనకు సంబంధించినదే. కొన్ని బోర్డ్స్ రప్పించారు. వాటి మీద రకరకాల జంతువుల పేర్లు ఉన్నాయి. ఏ జంతువు ఎవరికి సూటవుతుందో చెప్పి వాళ్ల మెడలో ఆ బోర్డ్ వేయమన్నారు. గీతూకి ఊసరవెల్లి, సింహం బోర్డులు వచ్చాయి. రేవంత్‌కి గాడిద, సింహం వచ్చాయి. నేహాని ఊసరవెల్లి అన్నారు. ఆరోహిని పాము అన్నారు. చంటిని సింహంతో పోల్చారు. ఆదిరెడ్డిని ఏనుగులా తడబడకుండా నిలకడగా ఉంటాడన్నారు. ఇనయా అస్తమానం మాటలు మారస్తుందని ఊసరవెల్లిగాను, ఎప్పుడెలా రియాక్టవుతుందో తెలీదు కనుక పాముగాను భావించారు. మెరీనా ఏనుగులాంటిదన్నారు. శ్రీహాన్ కూడా ఊసరవెల్లి లాంటోడే అని తేల్చారు. హుందాతనంలో బాలాదిత్య ఏనుగుకి సాటి అన్నారు. అవకాశం కోసం వేచి ఉండి.. సమయం వచ్చినప్పుడు బుసలు కొట్టి.. చాన్స్ దొరకగానే ప్రత్యర్థిని మింగేస్తుందంటూ శ్రీసత్యకి పాజిటివ్ రిమార్క్స్ ఇచ్చారు. ఇక గాడిద బోర్డ్ కోసమైతే పెద్ద పోటీనే ఏర్పడింది. మొదట అది రేవంత్‌కి దక్కింది. గాడిదలా పని చేసుకుంటూ పోతాడే తప్ప దానికో పద్ధతి ఉండదంటూ చంటి అతని గురించి చెప్పాడు. ఆ తర్వాత కీర్తిని ఇద్దరు గాడిదతో పోల్చారు. చాలా కష్టపడి పని చేస్తుంది కానీ రావలసినంత గుర్తింపు రావడం లేదని అన్నారు. బుర్ర లేకుండా ఆడాడని అర్జున్‌ని, నిరంతరం కష్టపడుతుందనే కారణంతో సుదీపని కూడా గాడిదతో పోల్చి చూపించారు హౌస్‌మేట్స్. దీని తర్వాత కాసేపు డమ్ షరాడ్స్ ఆడించి అందరినీ ఎంటర్‌‌టైన్ చేశారు నాగ్.

ఎవరు ఇన్? ఎవరు ఔట్?

ఈవారం ఆరుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వారిని ఇద్దరేసి చొప్పున సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగార్జున. మొదట గీతూ, శ్రీహాన్ సేవ్ అయిపోయారు. తర్వాత రేవంత్, ఇనయా, బాలాదిత్య, ఆరోహి కూడా ఎలిమినేషన్‌ నుంచి బయటపడ్డారు. చివరికి వాసంతి, నేహ మిగిలారు. వీరిలో ఒకరు వెళ్లిపోతారంటూ చాలా రోజుల నుంచీ ప్రచారం జరుగుతోంది. అది నిజమై ఇద్దరూ ఎలిమినేషన్ రౌండ్ ఫేస్ చేశారు. వాళ్ల ఫొటోలు తక్కెడలో ఉంచి తులాభారం వేశారు నాగ్. ఓట్ల ఆధారంగా వాసంతి ఎక్కువ బరువు తూగడంతో నేహ ఎలిమినేట్ అయ్యింది. ఇది ఆమెని చాలా హర్ట్ చేసింది. సెండాఫ్ ఇవ్వడానికి అందరూ దగ్గరకు వెళ్తున్నా కూడా వద్దని వారించి లోపలికి వెళ్లిపోయింది. కాసేపు ఎమోషనల్ అయిపోయింది. ఆ తర్వాత తేరుకుని అందరికీ బై చెప్పింది. ఎవరినైతే నమ్మానో వాళ్లవల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చినందుకు కోపంగా వెళ్లిపోతున్నానని వాళ్లతో చెప్పి బైటికొచ్చేసింది.

దమ్మూ ఉంది.. దుమ్మూ ఉంది

స్టేజ్‌ మీదికి వచ్చిన నేహకి ఓ టాస్క్ ఇచ్చారు నాగ్. హౌస్‌లో దమ్మున్న ఐదుగురిని, దుమ్ములాంటి ఐదుగురిని సెలెక్ట్ చేసి చెప్పమన్నారు. ముందుగా దుమ్ము వైపు వెళ్లింది నేహ. ఐదుగురినే పెట్టమన్నా తన దృష్టిలో ఆరుగురు ఉన్నారంటూ రేవంత్, ఇనయా, ఆరోహి, గీతూ, అర్జున్, వాసంతిలను దుమ్ము బ్యాచ్‌లో పడేసింది. ఆటని ఎలాగైనా ఆడేయొచ్చు అనుకుంటారే తప్ప వీళ్లెవరూ పద్ధతిగా ఆడటం లేదని చెప్పింది. ఇక తాను ఎలిమినేట్ అవ్వడానికి రేవంతే కారణమంది. ఆ వారమంతా తాను రేవంత్‌ని సపోర్ట్ చేసినా అతను తనని నామినేట్ చేసి వెన్నుపోటు పొడిచాడని ఫీలయ్యింది. ఆ తర్వాత దమ్మున్న ఆటగాళ్లుగా రాజ్, చంటి, సుదీప, శ్రీహాన్, బాలాదిత్య, ఆదిరెడ్డి, శ్రీసత్యలను ఎంపిక చేసింది. రాజ్‌ తనకి చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడని, తనని వదిలి వెళ్లడం బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. సుదీప చాలా మంచిదంది. శ్రీహాన్‌ ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇస్తాడని చెప్పింది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది బాలాదిత్య నుంచే నేర్చుకున్నానని, అతను ఫిజికల్‌గానూ మెంటల్‌గానూ చాలా బలవంతుడని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. శ్రీసత్య చాలా స్ట్రాంగ్ అంది. కామన్ మేన్ స్థాయి నుంచి కెప్టెన్‌ స్థాయి వరకు ఎదిగిన ఆదిరెడ్డి ఇక్కడితో ఆగిపోడని, టాప్‌ ఫైవ్‌కి వెళ్తాడని జోస్యం చెప్పింది. ఆ తర్వాత నాగ్‌కి బై చెప్పి వెళ్లిపోయింది. 
    

మొత్తానికి మూడో వారం ఎలిమినేషన్ అలా పూర్తయ్యింది. ఇప్పటికి ముగ్గురు కంటెస్టెంట్లకి హౌస్ బై చెప్పేసింది. ఇక నెక్స్ట్ వీక్‌ ఎవరు ఎలిమినేషన్‌ని ఫేస్ చేస్తారు అనేది సోమవారం ఎపిసోడ్‌లో తేలబోతోంది. ఇప్పటికే కీర్తి, అర్జున్‌లని తన స్పెషల్‌ పవర్‌‌తో డైరెక్ట్గా నామినేట్ చేశారు నాగ్. ఇక రేపు మిగతా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. శ్రీహాన్‌, సుదీపలు ఆరోహితో ఓ రేంజ్‌లో గొడవ పడినట్లు ప్రోమో ద్వారా అర్థమయ్యింది. ఆ గొడవ దేనికి జరిగిందో, ఎక్కడి వరకు వెళ్లిందో చూడాలి మరి.