చీమలు, పందికొక్కుల వల్లే సాగర్‌‌‌‌ కాల్వకు గండి

చీమలు, పందికొక్కుల వల్లే సాగర్‌‌‌‌ కాల్వకు గండి

హాలియా, వెలుగు: చీమలు, పందికొక్కుల కారణంగానే నాగార్జున సాగర్ ఎడమకాల్వకు గండి పడి ఉండొచ్చని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో సాగర్ ఎడమ కాల్వకు గండిపడిన ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు నోముల భగత్, సైదిరెడ్డి , బొల్లం మల్లయ్య యాదవ్‌‌తో కలిసి మంగళవారం మంత్రి పరిశీలించారు. సాగర్ ఎడమ కాల్వ అంచుల్లో కాకుండా కాల్వ మధ్యలో గండి పడటం టెక్నికల్‌‌గా అంచనా వేయలేకపోతున్నామని మంత్రి పేర్కొన్నారు. కాల్వ మధ్యలో సుడిగుండం ఏర్పడడం వల్ల ప్రమాదం జరగొచ్చని భావిస్తున్నామని చెప్పారు. ఒక్క ఎకరం కూడా ఎండిపోవద్దన్న ఉద్దేశంతోనే గండిని పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, రెండు, మూడ్రోజుల్లో పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు. 

సాగర్‌‌ ఎడమ కాల్వ గండి పూడ్చివేత

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు వద్ద సాగర్‌‌ ఎడమ కాల్వకు పడిన గండిని ఆఫీసర్లు పూడ్చివేశారు. కాల్వకు ఈ నెల 7న గండి పడడంతో ఎన్‌‌ఎస్పీ ఆఫీసర్లు నీటి విడుదలను నిలిపివేశారు. వెంటనే గండి పూడ్చి వేత పనులను ప్రారంభించారు. సుమారు 13 రోజుల పాటు పనిచేసి ఇసుక బస్తాలు, మట్టితో గండిని పూడ్చారు. మంగళవారం కట్ట పనులు పూర్తి కావడంతో నీటిని విడుదల చేశారు. ఎడమకాల్వ రెగ్యులేటరీ వద్ద ఎన్‌‌ఎస్పీ ఆఫీసర్‌‌ శ్రీకాంత్‌‌రావు నీటి విడుదలను ప్రారంభించారు. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.