మూడు పార్టీలకు సాగర్ ఎన్నిక సవాల్

మూడు పార్టీలకు సాగర్ ఎన్నిక సవాల్
  • గెలిస్తేనే నిలుస్తం
  • టీఆర్ఎస్.. పరువు కోసం పోరు
  • బీజేపీ.. 2023 ఎన్నికలకు సెమీఫైనల్
  • కాంగ్రెస్.. చావోరేవో

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ బై ఎలక్షన్.. మూడు ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. అక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ సీటు కాపాడుకోవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. సాగర్ లో గెలిస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఈజీ అవుతుందని బీజేపీ భావిస్తోంది. తమ సీనియర్ లీడర్ జానారెడ్డి విజయం సాధిస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇలా మూడు పార్టీలు సాగర్ ఉప ఎన్నికను.. తమ భవిష్యత్ రాజకీయాలకు గీటురాయిగా పెట్టుకున్నాయి. గత ఏడాది డిసెంబర్ 1న నోముల నర్సింహయ్య చనిపోవడంతో సాగర్ లో ఉప ఎన్నిక జరుగుతోంది. త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

వరుస ఫెయిల్యూర్లతో టీఆర్ఎస్..

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరుస ఫెయిల్యూర్లతో దెబ్బతిన్న టీఆర్ఎస్.. సాగర్ లో పరువు కోసం ప్రయత్నిస్తోంది. దుబ్బాకలో గెలిచి తీరుతామన్న ధీమాతో సీఎం కేసీఆర్ ప్రచారానికి వెళ్లలేదు. కానీ అక్కడ బీజేపీ గెలిచింది. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చింది. 48 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో అలర్టయిన కేసీఆర్.. సాగర్ లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. అక్కడ కూడా ఓడిపోతే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కష్టమవుతుందని ఆ పార్టీ లీడర్లే అంటున్నారు. అందుకే ఎలక్షన్ షెడ్యూలు రాకముందే కేసీఆర్.. సాగర్ పరిధిలో పర్యటించి, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులకు శంకుస్థాపన చేసి, అక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జిల్లాకు దాదాపు రూ.200 కోట్ల వరాలు ప్రకటించారు. సాగర్ లో తమ అభ్యర్థి గెలిస్తే  రెండు పార్టీలకు ఒకేసారి చెక్ పెట్టినట్లు అవుతుందని టీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న బీజేపీని కట్టడి చేసినట్లేనని అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని రెండోసారి ఓడించడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతుందని చెబుతున్నారు.

చిన్నపరెడ్డికి బుజ్జగింపులా? టికెట్టా?

హాలియా సభ సందర్భంగా ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని సీఎం కేసీఆర్ తనతోపాటు హెలికాప్టర్ లో తీసుకెళ్లారు. సాగర్​లో పోటీ చేయాలని భావిస్తున్న చిన్నపరెడ్డి.. టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో పార్టీ నుంచి వెళ్లొద్దని నచ్చచెప్పేందుకే చిన్నపరెడ్డిని తనతోపాటు సభకు కేసీఆర్ తీసుకెళ్లినట్టు చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డి అనే సంకేతాలు ఇచ్చేందుకని కూడా అంటున్నారు. కానీ చిన్నపరెడ్డి అభ్యర్థిత్వంపై జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి సానుకూలంగా లేరని, తన అనుచరుడైన ఎంసీ కోటిరెడ్డిని బరిలోకి దించేందుకు ఆయన పావులు కదుపుతున్నారని పార్టీ లీడర్లు చెప్తున్నారు.

ఓడితే కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం

తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కాంగ్రెస్ బలహీనపడుతోంది. దుబ్బాకలో థర్డ్ ప్లేస్​కు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫోర్త్ ఫ్లేస్​కు పడిపోయింది. దీనికితోడు.. రాష్ట్ర నేతలు ఎవరికివారుగా వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ కేడర్ డీలా పడుతోంది. పీసీసీ కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ భావించినా.. తర్వాత ఆ ఆలోచన విరమించుకుంది. బై ఎలక్షన్ తర్వాతే నియమిస్తామని ప్రకటించింది. దీంతో సాగర్ ఎలక్షన్​ను హైకమాండ్ సీరియస్​గా తీసుకున్నట్లు అర్థమవుతోంది. అందుకే జానారెడ్డిని పోటీ చేయమని స్వయంగా ఏఐసీసీ పెద్దలు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా ఇంటికే పరిమితమైన జానారెడ్డి.. సాగర్ సీటు ఖాళీ తర్వాత మళ్లీ తెర మీదికి వచ్చారు. నియోజకవర్గంలో మళ్లీ పట్టు సాధించేందుకు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ లో గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ లీడర్లు లెక్కలు వేస్తున్నారు. ఓడిపోతే పార్టీ ఉనికే డేంజర్​లో పడుతుందని అంటున్నారు.

2023 టార్గెట్తో బీజేపీ
దేశంలో ఒక్కో రాష్ట్రంలో పాగా వేసుకుంటూ ముందుకుపోతున్న బీజేపీ.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ను, తర్వాత తెలంగాణను టార్గెట్గా పెట్టుకుంది. అందుకే సాగర్ ఉప ఎన్నికను ఆ పార్టీ సీరియస్గా తీసుకుంటోంది. అక్కడ గెలిస్తే.. 2023 టార్గెట్ను సాధించొచ్చని భావిస్తోంది. సెంట్రల్ పార్టీ కూడా అదే
కోణంలో రాష్ట్ర నాయకత్వాన్ని గైడ్ చేస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకోవడం, అందులో ఏకంగా సీఎం కేసీఆర్ కూతురు కవిత, ఆయన బంధువు వినోద్ కుమార్‌ను బీజేపీ ఓడించడంతో హైకమాండ్ చూపు తెలంగాణపై పడింది. మొన్న దుబ్బాకలో టీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకోవడంతో కమల దళంలో జోష్ ఒక్కసారిగా పెరిగింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్ల నుంచి ఏకంగా 48 సీట్లకు బలాన్ని పెంచుకుంది. దీంతో ఇదే ఊపు కొనసాగిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారు. ఈ వరుసలో వచ్చిన నాగార్జున సాగర్ బై ఎలక్షన్‌ను
2023 ఫైనల్‌కు ముందు జరిగే సెమీ ఫైనల్‌గా బీజేపీ భావిస్తోంది. అందుకే అభ్యర్థి ఎంపిక నుంచే ఆచితూచి అడుగులేస్తోంది.

For More News..

గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీ తొలగింపు

కొత్త బార్లకు 8 వేల అప్లికేషన్లు.. ఒక్క బార్‌కు మాత్రం 317 అప్లికేషన్లు