- లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ విద్యుత్ ఏఈ, షాద్‌నగర్ డీఎస్వో ఆఫీస్ డీటీ
కల్వకుర్తి, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ విద్యుత్ ఇన్చార్జి ఏఈ మంగళవారం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దండ మండలం చొక్కనపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలోని ఫామ్‌హౌస్‌కు విద్యుత్ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కావాలని విద్యుత్ ఏఈ వెంకటేశ్వర్లును ఆశ్రయించాడు. ఇందుకోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేయడంతో, రూ.15 వేలు ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం తన పొలంలో ఏఈ వెంకటేశ్వర్లుకు రూ.15 వేలు ఇవ్వగా, అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని వారు తెలిపారు.
రంగారెడ్డి కలెక్టరేట్: లంచం తీసుకుంటూ రంగారెడ్డి డీఎస్వో ఆఫీస్ డిప్యూటీ తహసీల్దార్ హన్మంతు రవీందర్ నాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ యాదయ్య షాపులో స్టాక్‌లో తేడా ఉందని ఇటీవల ఆఫీసర్లు గుర్తించారు. ఈ క్రమంలో డీలర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయకుండా ఉండేందుకు ఫైన్‌తో పాటు రూ.30 వేలు లంచం ఇవ్వాలని డీటీ డిమాండ్ చేశాడు. దీంతో యాదయ్య రూ.10 వేలు ఇచ్చి ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం షాద్‌నగర్ బస్టాండ్ సమీపంలోని ఉడిపి హోటల్‌లో రూ.20 వేలు అందజేయగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీటీ హన్మంతు రవీందర్ నాయక్ ను ఏసీబీ కోర్టులో హాజరు పర్చుతామని హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

