జన జాతర.. నాగోబాకు నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు

 జన జాతర.. నాగోబాకు నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు
  • గంటల తరబడి క్యూలో ఉండి దర్శనం

ఇంద్రవెల్లి, వెలుగు: నాగోబా జనసంద్రమైంది. ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​లో నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. గురువారం దర్బార్ జరగ్గా ఉమ్మడి జిల్లా నుండే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి క్యూలైన్​లో ఉండి నాగోబా దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎఫ్​వో ప్రశాంత్ బాజీరావ్ పటేల్ పూజలు చేశారు. ఈ సందర్బంగా  మెస్రం వంశీయులు మంత్రి కొండా సురేఖ, నేతలు, అధికారులను సన్మానించి నాగోబా ప్రతిమలు అందించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 

నాగోబా దర్బార్ హాల్​లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భద్రాచలం ఆదివాసీ కళాకారుల కొమ్ము డ్యాన్స్, మహారాష్ట్ర గోండి డాన్స్ తోపాటు స్థానిక కళాకారులు నిర్వహించిన గుస్సాడీ, దెంసా, వివిధ స్కూళ్లు, కాలేజీలకు చెందిన విద్యార్థులు వివిధ వేషధారణలో చేసిన సాంప్రదాయ నృత్యాలు 
ఎంతగానో ఆకట్టుకున్నాయి.