కార్తీక మాసం, నాగుల చవితి సందర్భంగా శైవ క్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఖమ్మంలోని ఇంద్రానగర్ పర్ణశాల, నరసింహస్వామి ఆలయం, గుంటు మల్లేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. పుణ్య స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. పుట్టలో పాలు పోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు .
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం దగ్గర ఉన్న పుట్టలో పాలు పోసి పూజలు చేశారు. మహాదేవపూర్ మండలం కాళేశ్వరం, మల్హార్ మండలం కొయ్యుర్ దగ్గరున్న నాగులమ్మ ఆలయానికి మహిళలు భారీగా చేరుకున్నారు. పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు.
శంషాబాద్ లో ఘనంగా నాగుల చవితి పూజలు జరుగుతున్నాయి. వెండికొండ సిద్దేశ్వర ఆలయంతో పాటు నాగదేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుట్టల దగ్గర మహిళలు భారీగా చేరుకొని పూజలు చేశారు. ఉదయం నుంచే మహిళా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
