హిందువులు.. కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితిని జరుపుకుంటాము. . నాగులచవితి రోజు సుబ్రమణ్యేశ్వర స్వామిని .. నాగేంధ్రస్వామిని పూజించడం ద్వారా ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. నాగేంధ్రస్వామి కొలువై ఉంటే పుట్టలో ఆవుపాలు.. చలిమిడి.. చిమ్మిలి... బియ్యం నూక సమర్పిస్తారు. స్వామికి ఇవి సమర్పించేటప్పుడు చదవాల్సిన మంత్రాల గురించి తెలుసుకుందాం. . .
కార్తీక మాసం శివకేశవులకే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి కూడా చాలా విశేషమైనదని పురాణాల ద్వారా తెలుస్తుంది. కార్తీకమాసం శుద్ద చవితి రోజు ( 2025 అక్టోబర్ 25) నాగేంద్రుడు.. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. ఈరోజున నాగులచవితిగా పిలుస్తూ.. చలిమిడి, చిమ్మిలి, ఆవు పాలు, పూలు, పళ్లు తీసుకుని దగ్గర్లోని పుట్ట దగ్గరకు వెళ్లి.. నాగేంధ్రుడి దగ్గర దీపారాధన చేసి.. పూజ చేస్తారు. అనంతరం పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి నమస్కరించుకుంటారు. సిటీల్లో పుట్టలు ఉండవు కనుక... దేవాలయాల్లో నాగేంద్రుని ప్రతిమలకు సమర్పిస్తారు.
స్వామికి పైన తెలిపిన పదార్దాలను భక్తితో సమర్పించేటప్పుడు కొన్ని మంత్రాలను చదవాలి.
- చలిమిడి సమర్పిస్తూ... చలిమిడితిని చల్లంగా చూడు
- చిమ్మిలి ( బెల్లం మరియు నువ్వులు) సమర్పిస్తూ... చిమ్మిలి తిని సిరులు ఇమ్ము
- నూకను ( బియ్యం నూక) సమర్పిస్తూ ....నూకను తీసుకొని మూకను కాపాడు
- ఆవుపాలు సమర్పిస్తూ ...పాలు తాగి పవళింపు
అని చదవుతూ స్వామికి సమర్పించాలి.
నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసినా.. నాగేంద్రుని ప్రతిమలకు సమర్పించినా.. జాతకంలో రాహు.. కేతు గ్రహాల దోషాలు ఉంటే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. చాలా మంది భక్తులు ఇంట్లో పూజలు జరిపి పుట్టల్లో పాలు పోసి నాగ దేవతలను ఆరాధిస్తారు.
నాగుల చవితి నాడు నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, విష్ణువు ఆదిశేషుగా మారతారని చెబుతారు. అందుకనే భక్తులు నాగదేవతను ఆరాధిస్తారు. సంతానం లేని వారు నాగదేవుని ఆరాధిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
పుట్టలో పాలు ఎందుకు పోయాలి..
మానవునికి శరీరం మొత్తంలో నవరంధ్రాలుంటాయి. ఈ 9 రంధ్రాలు.. శరీరంలోని నాడులు కలిసి వెన్నెముక ఉంటుంది. దీనినే వెన్నుపాము అంటారు. ఇది మానవ శక్తికి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగ శాస్త్రం చెబుతోంది. మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు ఉంటూ కామ, క్రోధ, లోభ,మద, మోహ, మాత్సర్యాలు అనే విషాలను కక్కుతూ.. మనిషిలో ఉండే సత్వగుణ సంపత్తిని హరిస్తుంది.. అందుకే నాగుల చవితి రోజు పాము ( వెన్నుముకను)... పుట్టను ( మానవ శరీరాన్ని) ఆరాధించి పుట్టలో పాలు పోస్తే.. మనిషిలో ఉన్న విష సర్పం కూడా శ్వేతతత్వం పొందుతుందని.. అలాగే అందరి హృదయాల్లో కొలువై ఉండే.. శ్రీమహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారాలని కోరుకుంటూ చేసేదే నాగుల చవితి .. అందుకే ఈ రోజున ( అక్టోబర్ 25) పుట్టలో పాలు పోయడంలో ఆంతర్యమని పండితులు చెబుతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని పండితుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులకు సంబంధం లేదు.
