సమ్మెలో కార్మికులు.. వంట చేసిన టీచర్లు

సమ్మెలో కార్మికులు.. వంట చేసిన టీచర్లు

గూడూరు, వెలుగు:  సర్కారు బిల్లులు ఇవ్వకపోవడంతో నాయక్ పల్లి హైస్కూల్​లో మధ్యాహ్న   భోజన నిర్వాహకులు వంట చేయడం బంద్ ​చేశారు. దీంతో స్టూడెంట్లు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్ పల్లి హైస్కూల్​లో 78 మంది స్టూడెంట్లు ఉన్నారు. గ్రామానికి చెందిన కొమురమ్మ మరో ఇద్దరితో కలిసి స్కూల్​లో మధ్యాహ్న భోజనం వండిపెట్టేది.  పది నెలలుగా ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాకపోవడం, మరోవైపు అప్పులు పెరిగిపోతుండడంతో ఈ నెల 1 నుంచి స్కూల్​లో వంట చేయడం మానేసింది. అయితే స్టూడెంట్లు ఇబ్బంది పడుతుండడం గమనించిన ప్రిన్సిపల్ యాకయ్య వేరే వ్యక్తులతో వంట చేయించాడు. 

పది నెలలుగా తనకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాలేదని, మీకూ అదే పరిస్థితి ఎదురవుతుందని కొమురమ్మ వారితో చెప్పింది. దీంతో మూడు రోజులుగా వారు కూడా వంట చేయడం బంద్​చేశారు. చేసేది లేక స్టూడెంట్లు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా  మధ్యాహ్న భోజనం పథకం పైసలు రిలీజ్ చేయాలని స్టూడెంట్స్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదని మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రిన్సిపల్​యాకయ్య చెప్పారు. 

రామాయంపేట, వెలుగు: బిల్లులు చెల్లించడం లేదని మిడ్ డే మీల్స్ కార్మికులు స్కూళ్లలో వంట బంద్ చేయగా టీచర్లే వంట మనుషులుగా మారారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వేతనాలు, గుడ్ల బిల్లులు నెల రోజులుగా పెండింగ్​లో ఉన్నాయని, బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామంటూ మెదక్​జిల్లా రామాయంపేట పట్టణంలోని ఆరు ప్రభుత్వ స్కూళ్ల మధ్నాహ్న భోజన కార్మికులు బుధవారం ఎంఈవో ఆఫీస్​ఎదుట ఒక రోజు సమ్మె చేశారు. దీంతో ఆ స్కూళ్లలో టీచర్లే అన్నం, కూరలు వండి స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం పెట్టారు.