2025 భారత్‌‌‌‌ను గర్వపడేలా చేసింది.. ఆపరేషన్ సిందూర్‎తో ప్రపంచానికి మన శక్తిని చూపాం: ప్రధాని మోడీ

2025 భారత్‌‌‌‌ను గర్వపడేలా చేసింది.. ఆపరేషన్ సిందూర్‎తో ప్రపంచానికి మన శక్తిని చూపాం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: 2025 సంవత్సరంలో భారత్‌‌‌‌ గర్వపడే క్షణాలెన్నో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌‌‌‌పై చేపట్టిన ఆపరేషన్​సిందూర్‌‌‌‌‌‌‌‌.. ప్రపంచానికి మన శక్తిని చూపిందని తెలిపారు. దేశ భద్రత విషయంలో రాజీపడబోమని తెలియజేశామన్నారు. ఈ ఆపరేషన్​ సందర్భంగా ప్రతి భారతీయుడు గర్వపడ్డాడని పేర్కొన్నారు. జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏండ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా దేశ ప్రజల్లో ఇదే స్ఫూర్తి కనిపించిందని పేర్కొన్నారు. 

ప్రజలు ‘వందేమాతరం150’ హ్యాష్‌‌‌‌ట్యాగ్‌‌‌‌తో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. మన్‌‌‌‌కీ బాత్‌‌‌‌129వ ఎపిసోడ్‌‌‌‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 2025లో దేశం  ప్రభావం ప్రతిచోటా కనిపించిందని చెప్పారు. ‘‘2025లో  దేశానికి గర్వకారణమైన మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి. జాతీయ భద్రత, క్రీడలు, శాస్త్రీయ ఆవిష్కరణలు.. ఇలా ప్రపంచంలోని ప్రతి వేదికపైనా దేశం ముద్ర కనిపించింది’’ అని వ్యాఖ్యానించారు.

క్రీడల్లో మెరిసినం..

ఈ ఏడాది క్రీడల్లో దేశం సత్తాచాటిందని, చిరకాలం గుర్తుండిపోయేలా చేసిందని  ప్రధాని మోదీ తెలిపారు.  టీమ్‌‌‌‌ఇండియా 12 ఏండ్ల తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నదని చెప్పారు. అలాగే, విమెన్స్​ క్రికెట్​ టీం మొదటిసారి వన్డే ప్రపంచ కప్‌‌‌‌ను కైవసం చేసుకున్నదని తెలిపారు. మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్‌‌‌‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించిందన్నారు. ఆసియా కప్ టీ20లో  విజయంతో త్రివర్ణ పతాకం గర్వంతో ఎగిరిందని, ప్రపంచ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లలో పారా-అథ్లెట్లు పతకాల పంట పండించారని తెలిపారు.

దేశంలో స్వదేశీ విప్లవం

దేశంలో స్వదేశీ విప్లవం కొనసాగుతున్నదని,  ప్రజలు ‘స్వదేశీ’ వస్తువులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఫ్రాన్స్ మ్యూజియంలో లభించిన పాత ఫొటో ఆధారంగా కాశ్మీర్‌‌‌‌లోని బారాముల్లా (జెహన్‌‌‌‌పోరా) వద్ద ఉన్న మట్టి దిబ్బలు 2 వేల  ఏండ్ల నాటి పురాతన బౌద్ధ స్తూపాలని నిర్ధారణ అయిందని చెప్పారు. మణిపూర్‌‌‌‌కు చెందిన  శ్రీరామ్ మోయిరంగ్తమ్ (40) కృషిని ప్రధాని కొనియాడారు. 

తన కుగ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి ఆయన సౌర శక్తిని  ఎంచుకున్నారని, ఆయన ప్రారంభించిన ప్రచారం వల్ల నేడు వందలాది ఇండ్లకు విద్యుత్ అందుతోందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌‌‌‌లో ఏపీలోని నరసాపురం లేస్‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌ చర్చనీయాంశంగా మారిందని, తరతరాల నుంచి మహిళలే ఈ అరుదైన కళను కాపాడుతూ వస్తున్నారన్నారు.  

ఒడిశాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు పార్వతీ గిరి జన్మశతాబ్ది వేడుకలను 2026 జనవరిలో నిర్వహించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ‘యంగ్ లీడర్స్ డైలాగ్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2025లో ప్రకృతి విపత్తులు కొంతమేర ఇబ్బందిపెట్టాయని అన్నారు. 2026లో కొత్త ఆశలు, కొత్త సంకల్పంతో ముందుకుసాగుదామని పిలుపునిచ్చారు.

సైన్స్, అంతరిక్ష రంగంలో ముందడుగు

ఈ ఏడాది సైన్స్, అంతరిక్ష రంగంలో  దేశం పెద్ద ముందడుగు వేసిందని ప్రధాని మోదీ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న మొదటి భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారని చెప్పారు. శాస్త్ర రంగంలో మనం సాధించిన విజయాలు, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఎంతో ముగ్ధులయ్యాయని తెలిపారు. 

నేడు  మన దేశం వైపు ప్రపంచం గొప్ప ఆశతో చూస్తోందని, దీనికి దేశ యువశక్తి అతిపెద్ద కారణమన్నారు. 2025 నాటికి దేశంలో చిరుతల సంఖ్య 30 కంటే ఎక్కువగా పెరిగిందని చెప్పారు. ఏడాది ప్రారంభం లో జరిగిన ప్రయాగ్‌‌‌‌రాజ్ మహాకుంభమేళా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని తెలిపారు. ఏడాది చివరలో అయోధ్యలో ధ్వజారోహణ వేడుక ప్రతి భారతీయుడు గర్వించేలా చేసిందని  పేర్కొన్నారు.