నైనీ బొగ్గు బ్లాక్​కు ఏనుగుల​ గండం!

నైనీ బొగ్గు బ్లాక్​కు ఏనుగుల​ గండం!
  •  ‘ఎలిఫెంట్ ​కారిడార్’ పేరుతో ఒడిశా కొర్రీలు
  • మూడేళ్లుగా స్టేజ్-2 ఎన్విరాన్​మెంట్​ పర్మిషన్లు ఇయ్యట్లే
  • ఓబీ, కోల్​ ఉత్పత్తికి వాయిదాల మీద వాయిదాలు
  • టార్గెట్లు కేటాయిస్తున్నా షురూ కాని బొగ్గు ఉత్పత్తి
  • తాజాగా ఆఫీసర్ల టీమ్​ను పంపేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఎనిమిదిన్నరేండ్ల కింద ఒడిశా రాష్ట్రంలో దక్కించుకున్న నైనీ కోల్​ బ్లాక్​లో బొగ్గు ఉత్పత్తి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏటా 10 మిలియన్​ టన్నుల ప్రొడక్షన్​పై ఆశలు పెట్టుకున్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా నైనీ బ్లాక్​ గని ప్రారంభానికి ఎలిఫెంట్​ కారిడార్​ రూపంలో గండం వచ్చిపడింది. ఏనుగులు తిరుగాడే ప్రాంతం కావడం వల్ల ఒడిశా ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటోంది. దీంతో మూడేండ్లుగా ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయిస్తున్నా, తట్టెడు బొగ్గు బయటకురాని పరిస్థితి ఉంది.  

350 మిలియన్​ టన్నుల నిక్షేపాలు

ఒడిశా రాష్ట్రంలోని మహానది కోల్​ఫీల్డ్​ పరిధిలో నైనీ కోల్​ బ్లాక్​ను ఆగస్టు 13, 2015లో కేంద్రం ద్వారా సింగరేణి దక్కించుకుంది.  సుమారు 913 హెక్టార్లలో బొగ్గు నిక్షేపాలు విస్తరించి ఉండగా,  783 హెక్టార్ల భూమి ఫారెస్ట్​లో ఉంది. సుమారు 9 చదరపు కిలోమీటర్ల పరిధిలో  350 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి 2.58 క్యూబిక్​ మీటర్ల మట్టి(ఓబీ) తొలగిస్తే సరిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని సింగరేణి ఓసీపీల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి 6 నుంచి 7 క్యూబిక్​ మీటర్ల మట్టి తొలగించాల్సి  వస్తోంది.   

నైనీ బ్లాక్​లో 20 నుంచి 30 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలుండటంతో ఖర్చు తగ్గి, సింగరేణికి భారీ లాభాలు వస్తాయనే అంచనా ఉంది.  జీ10 గ్రేడ్​ క్వాలిటీ బొగ్గును ఏటా 10 మిలియన్​ టన్నుల చొప్పున 38 ఏండ్ల పాటు ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా సుమారు 3200 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు ఏర్పాటుకు 2021, జనవరి 20 పబ్లిక్​ హియరింగ్​లో స్థానికులు ఓకే చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గును మంచిర్యాల జిల్లా జైపూర్​ సింగరేణి థర్మల్​ పవర్ ప్లాంట్​కు సప్లై చేయనున్నారు.

ఎలిఫెంట్​ కారిడార్​ పేరుతో అడ్డంకులు..

నైనీ బ్లాక్​  స్టేజ్​-–1కి 2021లో కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్​మెంట్​ అనుమతులు మంజూరు చేసింది. తర్వాత స్టేజ్–​-2 అనుమతి కోసం సింగరేణి ఒడిశా ప్రభుత్వానికి ఫైల్​ పంపింది.  పర్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఒడిశా సర్కారు  ఏనుగుల కారిడార్​ అంశాన్ని తెరపైకి తెచ్చింది. నైనీ బ్లాక్​కు 25 కిలోమీటర్ల రేడియస్​లోని  దట్టమైన అడవుల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందని, నైని గనిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా కారణంగా ఏనుగుల మనుగడ ప్రమాదంలో పడ్తుందని, గ్రామాలు ధ్వంసమై  గిరిజన ఆవాసాలు దెబ్బతింటాయని ఫారెస్ట్​ పర్మిషన్లు ఇవ్వకుండా అక్కడి సర్కార్​ కొర్రీలు పెడుతోంది. 

వైల్డ్​ లైఫ్​ మేనేజ్​మెంట్​ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పాలని కోరింది. దీంతో అటవీశాఖ సూచించిన అన్ని నిబంధనలు పాటిస్తామన్న సింగరేణి యాజమాన్యం, ప్రత్యామ్నాయ అటవీ భూమిని సైతం సమకూర్చింది. ఎలిఫెంట్​-హ్యుమన్​ కాంప్లిక్ట్​, నివారణ చర్యలపై ప్రత్యేకంగా నివేదిక రూపొందించి 2023 నవంబర్​లో ఒడిశా సర్కారుకు అందజేసింది. ఇది జరిగి ఐదు నెలలు దాటినా అక్కడి సర్కార్ నుంచి స్పందన రాలేదు.​ ఈ క్రమంలో అక్కడి అధికారులతో సంప్రదింపులు జరపడంతో నాటి సీఎండీ చొరవ చూపకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలున్నాయి. 

కోట్లలో ఖర్చు..

నైనీబ్లాక్​ నుంచి బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి ఇప్పటికే వందల కోట్లు వెచ్చించింది. నైని బ్లాక్​ నుంచి ప్రధాన రైల్వే మార్గానికి అనుసంధానం చేసేందుకు 68 కిలోమీటర్ల మేర ట్రైన్​​ ట్రాక్​ నిర్మాణపనులు జరుగుతుండడంతో ఏకంగా రూ.1,700 కోట్లు కేటాయించింది. రూ.2 కోట్లతో అనలిటికల్​ సెంటర్ నిర్మించింది. ఆర్​అండ్​ఆర్​ కోసం రూ.115 కోట్లు కేటాయించింది. సర్వేలు, ప్రభావిత గ్రామాల్లో మెడికల్​ క్యాంపులు, డ్రింకింగ్​ వాటర్​ సౌకర్యం, ఒడిశా తుపాను బాధితులకు సాయం పేరిట వందల కోట్లు ఖర్చు చేసినా ఇప్పటివరకు తట్టెడు బొగ్గు ఉత్పత్తి చేయకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల హడావిడి నేపథ్యంలో జూన్​ వరకు నైని బ్లాక్​కు స్టేజ్​–-2 పర్మిషన్లలో కదలిక వచ్చే అవకాశాలు కనిపించడంలేదు.  ఈ క్రమంలో ఓ బృందాన్ని ఒడిశాకు పంపించేందుకు ప్రస్తుత సర్కార్​ కసరత్తు చేస్తున్నట్లు ఆఫీసర్లు చెప్తుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి.