చివరి శ్వాస వరకు కార్మిక నేతే

చివరి శ్వాస వరకు కార్మిక నేతే

వర్తమాన తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డిది విలక్షణమైన వ్యక్తిత్వం. స్వాతంత్ర్యానికి పూర్వం 1934లో హైదరాబాద్ సంస్థానంలో జన్మించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదేండ్లపాటు హోం, కార్మిక శాఖ మంత్రిగా పని చేసి 86 సంవత్సరాల వయసులో మరణించారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి సోషలిస్టు పార్టీ సభ్యుడిగా చేరి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగారు. ఆ రోజుల్లో సోషలిస్టు పార్టీ ఆధ్వర్యం లో హిందూ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్ )పేరుతో బలమైన ట్రేడ్ యూనియన్ పని చేసేది. 1949లో ఏర్పడిన హెచ్ఎంఎస్ లో సభ్యుడిగా చేరిన నాయిని నర్సింహారెడ్డి చివరి శ్వాస వరకు ఆ సంస్థలోనే కొనసాగారు. దాన్ని స్వతంత్ర సంస్థగానే కొనసాగిస్తూ .. టీఆర్ఎస్ కార్మిక విభాగంలో విలీనం చేయడానికి ఒప్పుకోలేదు.

చాాలా మంది సోషలిస్టు నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్​ లో చేరినా నాయిని మాత్రం సోషలిస్టు పార్టీలోనే చాలా కాలం ఉన్నారు. 1978లో సోషలిస్టులు జనతా పార్టీలో విలీనమైనప్పుడు ఆయన జనతా పార్టీ సభ్యుడయ్యారు. ఆ పార్టీ తరఫున మొదటిసారి 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాయిని నర్సింహారెడ్డి 1960లో ప్రారంభమై 1969 నాటికి ఉధృతమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తిరిగి తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక నాయిని ఉద్యమాన్ని బలోపేతం చేసే ఆలోచనతో టీఆర్ఎస్​ లో చేరి మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ప్రముఖపాత్ర పోషించారు. అయితే లోహియా నుంచి నేర్చుకున్న రాజకీయ విలువలను వదిలిపెట్టలేదు. ట్రేడ్​ యూనియన్ నాయకునిగా, కార్మికుల పట్ల పక్షపాత ధోరణిని విడనాడ లేదు. నిరాడంబరంగా జీవించారు.

కార్మికుల కోసం నిలబడ్డారు

ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టి చూపే రెండు ఘటనల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించాలి. అందులో మొదటిది నార్కట్​పల్లిలోని ఓసీటీఎల్ అనే కంపెనీకి సంబంధించినది. ఓసీటీఎల్​ యాజమాన్యం అత్యంత అమానుషంగా వ్యవహరిస్తుండేది. యాజమాన్యం చిన్నపాటి నిరసనను కూడా సహించేది కాదు. నలుగురు కలిసినప్పుడు కష్టసుఖాలు మాట్లాడుకున్నా కఠిన చర్యలు తీసుకునే వారు. పని స్థితిగతులను మార్చడానికి ఏదైనా ప్రయత్నం చేద్దామని అనుకుంటే వారిని ఉద్యోగంలో నుంచి తీసేసే వారు. తెలంగాణ ఉద్యమకాలంలో ఓసీటీఎల్​ కార్మికులు అంతర్భాగమై, తమ హక్కుల సాధన కోసం టీఆర్ఎస్​ నాయకుల నేతృత్వంలో యూనియన్​ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కార్మికులు సాహసించి జీతాలు పెంచమని సమ్మె చేశారు. దీంతో యాజమాన్యం లాకౌట్​ ప్రకటించింది. అయినా కార్మికులు సమ్మెను కొనసాగించారు. ఆ సమ్మెలో కేబినెట్​ మంత్రిగా ఉన్న నాయిని కార్మికుల పక్షాన నిలిచారు. అట్లా కార్మికులకు మద్దతిస్తే రాష్ట్రం నుంచి కంపెనీ తరలిపోతదని ఒకరిద్దరు కేబినేట్​ మంత్రులు ఆక్షేపించారు. అయినా నాయిని తన వైఖరిని మార్చుకోలేదు. ఉద్యమంలో కలిసి నడిచిన వాళ్లకు, పార్టీ ఆధ్వర్యంలో పని చేస్తున్న యూనియన్​ నాయకులకు అన్యాయం చేయొద్దని వారించారు. సిబ్బంది లేకుండా వెళ్లి యాజమాన్యాలను కలిసి కార్మికులకు న్యాయం చేయమని అడిగాడు. ఆయన కృషితో కంపెనీని తెరిచారు. కానీ యాజమాన్యం కార్మికులను విపరీతంగా వేధింపులకు గురి చేసింది. ఆ క్రమంలో కార్మికులకు, యాజమాన్యానికి మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ సందర్భంలోనూ ఆయన కార్మికుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేశారు. చాలా సార్లు ముఖ్యమైన కేబినేట్​ సహచరులు, ఒకరిద్దరు సహకరించకపోవడం వల్ల న్యాయం చేయలేక పోతున్నానని బాధపడ్డారు.

ఎవరూ సహకరించకున్నా..

అట్లాంటిదే మరో ఘటన హిందాల్కో కంపెనీకి సంబంధించినది. దానికి నేను సాక్ష్యం. అల్యూమినియం షీట్లు, ఫాయిల్స్​ హిందాల్కోలో తయారు చేస్తుంటారు. తమ ఉత్పత్తులకు గిరాకీ లేదని ఆ కంపెనీ కార్మికులను తొలగించడానికి పూనుకున్నది. ఆ సమయంలో కార్మికులు, కార్మిక శాఖకు నివేదించుకున్నారు. ఆ సమయంలో నాయిని నర్సింహారెడ్డి కీలక పాత్ర పోషించారు. కానీ ఈ ఘటనలోనూ నాయినిని వారించి చర్చల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. బాధ్యతలను ఒక అధికారికి అప్పగించారు. ఆయన యాజమాన్యం తరఫున మాట్లాడాడు. అక్కడ కార్మికుల పక్షాన నాయిని నర్సింహారెడ్డి నిలిచారు.

ఆ స్ఫూర్తిని బతికించుకోవాలి

నాయిని ఎప్పుడూ కార్మికులకు అందుబాటులో ఉండేవారు. తోచిన మేరకు సహాయం అందించేవారు. అయితే అనేక ఆంక్షల నడుమ నాయిని పనిచేశారు. హోంమంత్రిగా చేయలేనని బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. నా దగ్గర టోపీ మాత్రమే ఉందని, లాఠీ లేదని ఎన్నోసార్లు అన్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఒక ఫంక్షన్​లో కనబడితే మీరుండగా కార్మికులకు న్యాయం జరగకపోతే ఎట్లానని అడిగితే ‘ఏం చేయమంటావు. నా చేతుల్లో ఏం లేదు. అయినా నా వంతు ప్రయత్నం చేస్తా’ అన్నారు. అప్పటికి ఆయనకు మంత్రి పదవి లేదు. కానీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిని చూసి ఆవేదన చెందారు. చివరి దాకా సోషలిస్టుగా, కార్మిక పక్షపాతిగా, నిరాడంబరంగా జీవించారు. అందుకే ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉన్నారు. నిజాం కాలంలోని ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాల నుంచి పుట్టి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దాకా బలంగా నిలిచిన నాయిని స్ఫూర్తిని బతికించుకోవడం నేటికీ అవసరం.-ఎం.కోదండరామ్, టీజేఎస్ ప్రెసిడెంట్