వరంగల్పై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్.. నాయిని, జంగా మధ్య కుదిరిన సయోధ్య

వరంగల్పై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్..  నాయిని, జంగా మధ్య కుదిరిన సయోధ్య

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్ లలో హోరాహోరీ పోరు నడుస్తోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు సిట్టింగ్ లే కావడంతో సహజంగా కొంత వ్యతిరేకత ఉండడం.. కాంగ్రెస్ పార్టీ ఆచితూచి టికెట్లను కేటాయించడంతో పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. జిల్లాలోని 12 స్థానాల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి మధ్య సయోధ్య కుదుర్చారు కాంగ్రెస్ పెద్దలు.

ఉప్పు-నిప్పుగా ఉన్న వరంగల్ వెస్ట్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. నాయిని రాజేందర్ రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవిని జంగా రాఘవరెడ్డికి అప్పగించింది. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా జంగాను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో నాయినికి తన మద్దతు ఉంటుందని జంగా రాఘవరెడ్డి చెప్పారు. 

వరంగల్ పశ్చిమ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మరోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రావు పద్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. నాలుగుసార్లు గెలిచిన వినయ్ తో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నాయిని, రావు పద్మ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రచారంతో మూడు పార్టీలు హోరెత్తిస్తున్నాయి.