భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పైలెట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ అయిన మణుగూరు మున్సిపాలిటీలో నక్ష సర్వే పురోగతిలో ఉందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో 15 రెవెన్యూ వార్డులను 97 బ్లాకులుగా విభజించామన్నారు. 7524 ఆస్తులను గుర్తించామని, ఇందులో 5064 ఆస్థుల సర్వే పూర్తి అయిందన్నారు. నక్ష లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భూ రికార్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
అనంతరం గ్రీవెన్స్‌లో దరఖాస్తులను స్వీకరించారు. ఆ తర్వాత ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 21న జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెంలలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1128 ఎగ్జామ్‌కు అటెండ్ కానున్నారని తెలిపారు. ఎస్పీ బి.రోహిత్‌రాజు మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ సందర్భంగా సెంటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
