నలందనగర్లో పార్కు కబ్జాల తొలగింపు

నలందనగర్లో పార్కు కబ్జాల తొలగింపు
  • గోడ కట్టి, టెంపరరీగా షెడ్డు వేసి 1,094 గజాల ఆక్రమణ      
  • విముక్తి కల్పించిన హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజేంద్రనగర్ లోని హైదర్​గూడలో ఆక్రమణలను మంగళవారం హైడ్రా అధికారులు తొలగించారు. పార్కులోని 1,094 గజాల స్థలాన్ని కబ్జాల చెర నుంచి విడిపించారు. హైదర్ గూడ ఏజీ ఆఫీసు కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ 2001లో హుడా అనుమతి  పొంది నలందనగర్ కాలనీ పేరిట లేఔట్ వేసింది. అయితే, లేఔట్​కోసం భూమిని అమ్మిన వారే తాము పార్కు కోసం వదిలిన స్థలాన్ని కబ్జా చేశారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 

పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన హైడ్రా చీఫ్​రంగనాథ్​ ఆ స్థలం నలందనగర్ కు చెందినదిగా గుర్తించారు. దీంతో మంగళవారం పార్కులో కట్టిన గోడను, టెంపరరీగా ఏర్పాటు చేసిన షెడ్డును తొలగించారు. ఈ క్రమంలో ఆక్రమణకు పాల్పడినవారు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఆందోళనకు దిగారు. దీంతో రాజేంద్ర నగర్ పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలం తమకు దక్కిందని నలందనగర్ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

నాలాలను పరిశీలించిన హైడ్రా చీఫ్..

వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. బంజారాహిల్స్ రోడ్​నంబర్​12 చింతలబస్తీ  వద్ద ఉన్న కల్వర్టు 12 మీటర్ల విస్తీర్ణంలో ఉండగా కొన్నిచోట్ల 6 మీటర్ల మేర కబ్జాకు గురైంది. ఈ ప్రాంతాల్లో ఆక్రమణలను ఇప్పటికే కూల్చివేశారు. నాలా సగానికి సగం తగ్గడంతో కల్వర్టు కింద భారీగా చెత్తపేరుకుపోయి వరద సాగడానికి వీలు లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ చెత్తను జేసీబీతో తొలగించారు. ఈ పనులను రంగనాథ్​పరిశీలించారు. ఇదే మాదిరి నగరంలోని ప్రధాన కల్వర్టుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు కృష్ణానగర్ లో నాలాల తీరును పరిశీలించారు. ఇటీవల 3 మీటర్ల వెడల్పుతో నిర్మించిన వరద కాలువ మధ్యలో ఎందుకు ఆగిపోయిందని అడిగి తెలుసుకున్నారు.