ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు : ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత  అన్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ తో కార్యకర్త బొడుసు వెంకటేశం ఇల్లు కాలిపోయింది.  బుధవారం సునీత   బాధిత ఫ్యామిలీని పరామర్శించి, కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. పరిహారం కింద ప్రభుత్వం  తరఫున రూ.12 వేలతో పాటు సొంతంగా మరో రూ.10 వేల నగదును బాధితులకు అందజేశారు. అదేవిధంగా బొమ్మల రామారం మండలం రంగాపురంలో బీఆర్ఎస్​లీడర్​బెజ్జంకి మల్లారెడ్డి ఇటీవల చనిపోయాడు. దీంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ కింద  శాంక్షన్​అయిన రూ.2 లక్షల చెక్కును బాధిత ఫ్యామిలీకి ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్​గౌడ్, చీకటి మామిడి సర్పంచ్ మచ్చ వసంత శ్రీను గౌడ్ పాల్గొన్నారు.  

అడ్వాన్సులిచ్చినా పనులు చేయరా? : కలెక్టర్​ పాటిల్​ హేమంత్​ కేశవ్​

మునగాల/నల్గొండ అర్బన్, వెలుగు : ‘మన ఊరు–  మన బడి’ స్కీమ్​కు ఫండ్స్​కొరత లేదు. అడ్వాన్స్​పైసలిచ్చినా పనులెందుకు చేపిస్తలేరని సూర్యాపేట కలెక్టర్ పాటిల్​హేమంత్​కేశవ్​ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మునగాల మండలంలోని బరాకత్ గూడెంలో ‘మనబడి’ పనులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్లో పనులు పూర్తి చేయకపోవడంపై ఆయన సీరియస్​ అయ్యారు.  కాంట్రాక్టర్లు పనిచేయకుంటే వారిని మార్చాలని ఆఫీసర్లకు సూచించారు. నెలాఖరులోగా ఎలక్ట్రీషన్​వర్క్స్​తో సహా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని స్కూళ్లను, హాస్టళ్లను కలెక్టర్​విజిట్ చేశారు. డీఈవో అశోక్, ఎంపీపీ బిందు, సర్పంచ్ వీరమ్మ , ఎంపీడీవో వెంకట్ తదితరులు  పాల్గొన్నారు. 

నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి

జిల్లాలో ఎంపిక చేసిన మోడల్​స్కూళ్లలో ‘మన ఊరు– మన బడి’ పెండింగ్ పనులు డిసెంబర్​చివరి నాటికి పూర్తి చేయాలని అడిషనల్​కలెక్టర్ కుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లోని ఉదయాదిత్య భవన్ లో ఎంఈవోలు, హెడ్​మాస్టర్లు, ఇంజినీరింగ్​ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. 

జాగా చూపకుండా పట్టాలెట్ల ఇచ్చిన్రు?

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు: పేదల కు జాగాలు చూపకుండా పట్టాలు ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారని చింతలపాలెం బాధితులు కొందరు తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా  సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్తేల నారాయణ రెడ్డి మాట్లాడుతూ  2004లో  చింతలపాలెం గ్రామానికి చెందిన పేదలకు ఆరు ఎకరాల్లో ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు కూడా పంపిణీ చేశారని, కానీ నేటికీ పొజిషన్​ చూపకపోవడం అన్యాయమన్నారు. రెవెన్యూ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, వెంటనే సర్వే చేసి ఇంటి జాగాలు చూపాలని డిమాండ్​చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి తహసీల్దార్​సచిన్ చందర్ తివారీకి వినతి పత్రం ఇచ్చారు.  

వడ్ల కొనుగోళ్లలో భారీ అవినీతి : టీపీసీసీ సెక్రటరీ పటేల్​ రమేశ్ ​రెడ్డి

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో వడ్ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరుగుతోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్‌‌ రమేశ్​రెడ్డి ఆరోపించారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని,  9 ఏండ్లలో అన్ని రంగాల్లోనూ అవినీతికి డోర్లు తెరిచారని విమర్శించారు. ప్రభుత్వం చేసిన అప్పులకు తగ్గట్లు అభివృద్ధి పనులు సాగడం లేదన్నారు. ఐకేపీ సెంటర్ల నిర్వహకులతో ఆఫీసర్లు కుమ్మక్కై వడ్ల కొనుగోలు చేయకున్నా చేసినట్లు బినామీ రైతులతో ట్రక్​షీట్లు సృష్టిస్తున్నారని,  ఇందులో టీఆర్‌‌ఎస్‌‌ నాయకుల హస్తం ఉందన్నారు. సూర్యాపేట జిల్లాలోనే మిల్లర్లు రూ.300 కోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి జగదీశ్‌‌రెడ్డి అనుచరులు చేస్తున్న అవినీతిలో ఆయన  హస్తం కూడా ఉందని, వడ్ల అక్రమాలను రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు.  

ఫసల్​ బీమా అమలు చేయాలి

యాదగిరిగుట్ట, వెలుగు: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, వెంటనే  అమలు చేయాలని బీజేపీ జిల్లా ట్రెజరర్​కాదూరి అచ్చయ్య డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో.. బుధవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లిలో తహసీల్దార్లకు బీజేపీ  లీడర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ‘గుట్ట’లో అచ్చయ్య మాట్లాడుతూ.. ఎన్నికల టైంలో రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా  నెరవేర్చలేదని విమర్శించారు. యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల బీజేపీ అధ్యక్షులు పాల్గొన్నారు. 

డీసీసీబీ చైర్మన్ ను విమర్శిస్తే ఊరుకోం

యాదగిరిగుట్ట, వెలుగు: డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి వంగపల్లి సర్పంచ్ కానుగు కవితకు లేదని, అవగాహన లేకుండా విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని వంగపల్లి ఎంపీటీసీ రేపాక మౌనిక హెచ్చరించారు. వంగపల్లిలో బుధవారం ఉపసర్పంచ్, వార్డు మెంబర్లతో కలిసి  ప్రెస్​మీట్​లో మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి ప్రొటోకాల్ పా టిస్తలేరని కవిత యాదగిరిగుట్టలో రాస్తారోకో చేయడాన్ని వారు ఖండించారు. కవిత సర్పంచ్ అయితే ఆమె భర్త బాలరాజు గౌడ్ పెత్తనం చెలాయిస్తున్నాడని, ముందు ఆమె భర్త అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూసుకోవాలని హితవు పలికారు.

అధికార పార్టీని సమష్టిగా ఎదుర్కొందాం

మిర్యాలగూడ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో   అధికార పార్టీని సమష్టిగా ఎదుర్కొందామని డీసీసీ ప్రెసిడెంట్​శంకర్​నాయక్​, కాంగ్రెస్​నేత, మున్సిపల్​ప్లోర్​లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డీసీసీ ప్రెసిడెంట్​గా శంకర్ నాయక్​ రెండోసారి ఎన్నికైన సందర్భంగా బుధవారం పట్టణంలో కాంగ్రెస్ లీడర్లు ఆయనను ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ అధికార పార్టీ దౌర్జన్యాలను తిప్పికొట్టాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుదామని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్​లీడర్లు వేణుగోపాల్​రెడ్డి, తమ్మడబోయిన అర్జున్, పొదిల శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

‘డబుల్’ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోండి

నార్కట్​పల్లి, వెలుగు: మండలంలోని బ్రాహ్మణ వెళ్లెంల, ఔరవాణి, నక్కలపల్లి గ్రామాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్​ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రాహ్మణవెళ్లెంల గ్రామంలో 150, ఔరవాణిలో 80, నక్కలపల్లిలో 42 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అర్హులైన  పేదలంతా తహసీల్దార్​ఆఫీస్​లో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఇండ్ల పంపిణీలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని అన్నారు.

నారసింహుడి సేవలో ప్రముఖులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని బుధవారం రాజకీయ, వ్యాపార ప్రముఖులు దర్శించుకుని పూజలు చేశారు. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, వ్యాపారవేత్త బోయినపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ఐజీ ప్రభాకర్​రావు వేర్వేరుగా వచ్చి నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సంప్రదాయ రీతిలో వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అద్దాల మండపం వద్ద  అర్చనలు వేదాశీర్వచనం చేసి,  ఆలయ ఆఫీసర్లు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. 

హెలికాప్టర్ కు పూజలు

‘ప్రతిమ గ్రూప్స్’ ఎండీ శ్రీనివాసరావు ‘హైదరాబాద్ ఎయిర్​లైన్స్​ప్రైవేట్ లిమిటెడ్’ తరఫున కొత్తగా కొనుగోలు చేసిన హెలికాప్టర్ కు ‘గుట్ట’లో  ప్రత్యేక పూజలు చేశారు.  ఈ పూజల్లో  మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు. హెలికాప్టర్ వద్ద కొబ్బరికాయలు కొట్టి శాస్త్రోక్తంగా వాహన పూజ చేశారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా బుధవారం ఆలయానికి రూ.16,06,866  ఆదాయం వచ్చిందని ఆలయ ఆఫీసర్లు చెప్పారు.