నల్గొండ మెడికల్​కాలేజీ పనులకు మోక్షం ఎప్పుడు..?

నల్గొండ మెడికల్​కాలేజీ పనులకు మోక్షం ఎప్పుడు..?

నల్గొండ, వెలుగు: నల్గొండకు మెడికల్​కాలేజీ శాంక్షన్​అయి రెండున్నరేళ్లు గడుస్తున్నా బిల్డింగ్​పనులు మాత్రం నేటికీ షురూ కాలేదు. కాలేజీ బిల్డింగ్​నిర్మాణానికి టెండర్లు సైతం పూర్తయి తొమ్మిది నెలలు గడుస్తోంది. కానీ పనులు ఎప్పుడు మొదలు పెడతారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సీఎం కేసీఆర్​తో బిల్డింగ్​నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలనేది ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆలోచన. సీఎం అగో వస్తడు.. ఇగో వస్తడని ఊరించే మాటలే తప్ప...అసలు ఎప్పటికి వస్తారో తెలియని పరిస్థితి. సీఎం రాక కోసం అధికారులు.. పనులు స్టార్ట్​చేయడం కోసం కాంట్రాక్టర్​ కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. నల్గొండతో సమానంగా సూర్యాపేట జిల్లాకు శాంక్షన్​అయిన మెడికల్​కాలేజీ బిల్డింగ్​పనులు పూర్తయ్యాయి. ఈ నెలలోనే కాలేజీని మెడికల్​డిపార్ట్​మెంట్​కు అప్పగిస్తారని చెబుతున్నారు. కానీ నల్గొండలోని మెడికల్​కాలేజీ పనులకు మోక్షం లభించలేదు. దాంతో మెడికల్​స్టూడెంట్లు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య గడుపుతున్నారు. స్టూడెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలు, కాలేజీ పరిస్థితి గురించి ఇప్పటికే అనేకసార్లు పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. 

ఆది నుంచి వివాదాస్పదమే..
కాలేజీ నిర్మాణం ఆది నుంచి వివాదాస్పదంగా మారుతోంది. రూ.117 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ కాలేజీ టెండర్​15.58 శాతం లెస్​కు కోట్​చేశారు. హైదరాబాద్​కు చెందిన ఓ కన్​స్ట్రక్షన్​ కంపెనీ టెండర్​ దక్కించుకుంది. అగ్రిమెంట్ ప్రకారం 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఇప్పటికే తొమ్మిది నెలలు పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. అగ్రిమెంట్​ కాగానే పనులు చేసేందుకు కాంట్రాక్టర్​ మెషినరీ మొత్తాన్ని సైట్​లో దింపారు. కానీ పనులు చేయకుండా రూలింగ్​పార్టీ లీడర్లు అడ్డుపడ్డారు. కాంట్రాక్టర్​ను తప్పించి నిర్మాణ పనులను వారి అనుయాయులకు కట్టబెట్టేందుకు పై స్థాయిలో తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ చివరకు టెండర్​దక్కించుకున్న సంస్థ మాటే చెల్లుబాటు కావడంతో రూలింగ్​పార్టీ లీడర్లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.  సీఎం పర్యటన పేరుతో పనులు వాయిదా వేయడానికి ఈ వివాదం కూడా ఒక కారణమని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా పనులు షురూ చేసి పూర్తి చేయాలని స్టూడెంట్లు కోరుతున్నారు.

మంత్రి హరీశ్​ ప్రోగ్రాం క్యాన్సిల్
సీఎం కేసీఆర్​ చేతులతోనే కాలేజీకి పునాదిరాయి వేయించాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే ఉన్నారు. వాస్తవానికి  కాలేజీ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి హరీశ్​రావుకు​సీఎం అప్పగించారు. ఇటీవల జిల్లాకు వచ్చిన కేసీఆర్​మంత్రి హరీశ్​కు ఫోన్​ చేసి కాలేజీ ఫాండేషన్​కార్యక్రమం గురించి చెప్పారు. ఈ మేరకు జూన్​4న హరీశ్​రావు ప్రోగ్రాం ఫిక్స్​అయింది. కానీ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో సీఎం రావాల్సిందేనని పట్టుబట్టారు. నల్గొండను దత్తత తీసుకున్న కేసీఆర్​వస్తేనే పట్టణానికి మేలు జరుగుతుందని, మరిన్ని నిధులు రాబట్టుకోవచ్చనే ఆలోచనతో పార్టీ పెద్దలను ఒప్పించి హరీశ్​ప్రోగ్రాం క్యాన్సిల్​చేయించారు. జిల్లా అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కాలేజీ ఫౌండేషన్​ గురించి ప్రస్తావించినప్పుడు కూడా సీఎం వస్తారనే మంత్రి చెప్పారు. ఇదంతా జరిగి రెండు నెలలు గడుస్తున్నా సీఎం పర్యటన సంగతి తేలలేదు. ఇప్పుడు కొత్తగా కేటీఆర్​వస్తారని ప్రచారం చేస్తున్నారు. నల్గొండలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నందున వాటిని కేటీఆర్​తో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగానే మెడికల్​ కాలేజీ ఫౌండేషన్​ కూడా ఉండొచ్చని అనుకుంటున్నారు.